ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: ప్రభుత్వం ఏ కార్యక్రమాన్నైనా తనకు అనుకూలంగా మలచుకునేందుకు అనేక ఎత్తుగడలు వేస్తోంది. మరో ఆరు నెలల్లో ఎన్నికలుండటంతో పాలకులు హడావుడి చేస్తున్నారు. పేదలను ఆదుకునేది తమ ప్రభుత్వమేనని చెబుతూ ఓట్లు దండుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈనెల 11 నుంచి 26వ తేదీ వరకు జరిగే మూడో విడత రచ్చబండను రాజకీయ వేదికగా మార్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రానున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మండల స్థాయి నేతలకు రచ్చబండలో ప్రాధాన్యం ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసింది.
ముగ్గురు సభ్యులతో కమిటీ:
రెండో విడత రచ్చబండలో దరఖాస్తు చేసిన లబ్ధిదారులతో పాటూ గత నెల 24 దాకా గృహ నిర్మాణ సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పౌరసరఫరాల విభాగానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల్లో అర్హులకు పథకాలు మంజూరు చేయనున్నారు. లబ్ధిదారుల ఎంపికకు, వారందరినీ మండల స్థాయిలో ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకువీలుగా ఓ కమిటీని వేయనున్నారు. ప్రభుత్వ ప్రయోజనం పొందే లబ్ధిదారులను సమీకరించే బాధ్యతలను ఈ కమిటీలకు అప్పగించి అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా సన్నద్ధం చేస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వేసే ఈ కమిటీలో సర్పంచ్, ఏదైనా మహిళా గ్రూపు సభ్యురాలు, ఎంపీడీఓ నామినేట్ చేసే వ్యక్తి మరొకరిని సభ్యులుగా నియమిస్తారు. యూనిట్లు పంపిణీ చేసే సమయంలో, లబ్ధిదారులకు అవగాహన కల్పించే విషయంలో వీరి పాత్ర ఉంటుంది.
అయితే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులకు కాకుండా అధికార పార్టీ వర్గాలకు బాధ్యతలు అప్పగించడంతో గందరగోళం నెలకొంది. అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నచోట వారు చూసుకుంటారు. లేనిచోట కమిటీల ఎంపికలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న పార్టీ తనకు ప్రయోజనం కలిగేలా చూసుకోవడం సాధారణమే అయినా..లబ్ధిదారులకు రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నించడాన్ని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఆరింటికి రచ్చబండ
మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో పెన్షన్లు, రేషన్ కార్డులు, గృహ నిర్మాణాలు, బంగారు తల్లి పథకంలో లబ్ధిదారులకు బాండ్ల అందజేత, ఇందిరమ్మ కలలు పథకంలో ఎస్సీ, ఎస్టీ కాలనీలో వసతుల కల్పన, ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులు 50 యూనిట్లలోపు వాడుకునే వారికి విద్యుత్ చార్జీల చెల్లింపులకు లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారుల జాబితాను విచారించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. మొదటి విడత రచ్చబండ దరఖాస్తులకు మోక్షం కలిగేందుకు ఏడాదికిపైగా పట్టింది. రెండో విడత విన్నపాలకు అంతకంటే ఎక్కువ సమయమే పట్టింది. లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే లబ్ధిపొందేది మాత్రం వేలల్లోనే. గతంలో దరఖాస్తు చేసుకున్న వాటికే దిక్కులేదు. ఇక వీటికి ఎప్పటికి మోక్షం కలుగుతుందోనని ప్రజలు విమర్శిస్తున్నారు.