రాజకీయ కక్ష సాధింపు
చాపాడు : వి.రాజుపాళెం గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య చిన్న రస్తా విషయమై జరిగిన వాగ్వాదంపై పోలీసులు రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ధ్వజమెత్తారు. విచారణ చేపట్టి న్యాయం చేయాల్సిన ఎస్‌ఐ రాజకీయ కోణంలో ఒక వర్గం వారిపై అక్రమ కేసులు నమోదు చేసి, అన్యాయంగా రిమాండ్‌కు తరలించటం ఎంత వరకు సమంజసమని ఆయన పేర్కొన్నారు. వి.రాజుపాళెంలో ఈ నెల 6న నల్లసింగ్ బసయ్య, నల్లసింగ్ కొండయ్య మధ్య పొలంలో రస్తా విషయమై స్వల్వ వాగ్వాదం చోటు చేసుకుంది.
కొండయ్య ఫిర్యాదు మేరకు ఎన్.బసయ్య, రమేష్, కుళ్లాయప్ప, శివ, శ్రీనివాసులు, పుల్లయ్య, కృష్ణయ్యపై హత్యాయత్నం కేసు నమోదు చేసి ఈ నెల 8న రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంవలో పోలీసు చర్యలు గ్రామంలో వర్గ పోరును పెంచేలా ఉన్నాయని ఎమ్మెల్యే చాపాడు ఎస్‌ఐ శివశంకర్, కొందరు కానిస్టేబుళ్లపై ప్రొద్దుటూరు డీఎస్పీ పూజితా నీలంకు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బసయ్య, కొండయ్య మధ్య జరిగిన గొడవలో శివ, శ్రీనివాసులు, పుల్లయ్య లేరని.. శివ పెద్దరికంగా ఇరు వర్గాల వారికి సర్ది చెప్పినా.. వీరి ముగ్గురిపైనా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు.
అధికార పార్టీ వైపు శివ వెళ్లలేదని, ఇతనితోపాటు బంధువులను అన్యాయంగా కేసులో ఇరికించడం ఎంత వరకు న్యాయమన్నారు. విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో చాపాడు పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ సభ్యుడు బాలనరసింహారెడ్డి, బీసీ మండల కన్వీనర్ రామచంద్రయ్య, ఎంపీటీసీ సభ్యుడు మహేష్‌యాదవ్, నాయకులు మడూరు ప్రతాప్‌రెడ్డి, సీవీ సుబ్బారెడ్డి, జయరామిరెడ్డి, బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు.
విచారణ చేపట్టిన డీఎస్పీ:
గ్రామంలో గురువారం రాత్రి డీఎస్పీ పూజితానీలం విచారణ చేపట్టారు. గొడవకు గల కారణాలు, జరిగిన తీరు, కేసులో ఉన్న వ్యక్తులపై స్థానికులతో విచారించి నివేదిక సేకరించారు. హత్యా ప్రయత్నం కేసులో నిందితులుగా ఉన్న నల్లసింగ్ బసయ్య, రమేష్, కుళ్లాయప్ప, కృష్ణయ్య, శివ, శ్రీనివాసులు, పుల్లయ్యకు గొడవతో ఉన్న సంబంధంపై గ్రామంలోని మహిళలను విచారణ చేశారు. పొలంలో దారి విషయమై కొండయ్య, బసయ్య గొడవ పడ్డారని మహిళలు తెలిపారు.
అందులో కొండయ్య గడ్డివామి కొడవలి తెచ్చుకున్నాడని, ఘర్షణలో కొడవలితో ఇతనికే చిన్నగాయమైందని పేర్కొన్నారు. శివ, శ్రీనివాసులు, పుల్లయ్య గొడవలో లేరని, మధ్యలో శివ వచ్చి ఇరువురిని విడిపించే ప్రయత్నం చేశాడని గ్రామానికి చెందిన వెంకటలక్షుమ్మ, దేవి, సుబ్బమ్మ, రమాదేవి, వెంకటసుబ్బమ్మతో పాటు మరో 20 మంది మహిళలు డీఎస్పీకి తెలిపారు. గ్రామంలో జరిగిన చిన్న గొడవపై ఏడుగురిపై కేసులు ఎలా పెట్టారో తెలియదన్నారు. గ్రామస్తుల తెలిపిన వివరాలను సేకరించుకున్న డీఎస్పీ బాధితులకు తగిన న్యాయం చేస్తామని తెలిపారు.
వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు
కమలాపురం అర్బన్: వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై తెలుగుదేశం ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆరోపించారు. గురువారం కమలాపురం సబ్‌జైలులో ఉన్న చాపాడు మండలం వి.రాజుపాళెం గ్రామానికి చెందిన ఆర్.శివయాదవ్‌తోపాటు వారి అనుచరులను ఆయన కలిశారు. అనంతరం జైలు బయట విలేకర్లతో మాట్లాడారు. గడిచిన శాసన సభ ఎన్నికల సమయంలో వి.రాజుపాళెం గ్రామానికి చెందిన శివయాదవ్, ఇతర కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీకి మద్దతుగా నిలిచినందుకు వారిపై అక్రమ కేసులను బనాయించారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, ఎంపీపీ రామచంద్రుడు, నాయకుడు గాందినగరం నాగసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.