సాక్షి, హన్మకొండ
ఏజెన్సీ వాసులకు సాంకేతిక విద్య అందుబాటులోకి రానుంది. మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లతో కళాశాల ప్రారంభం కానుంది. 6.54 కోట్లతో కళాశాల భవనాలను నిర్మించనున్నారు. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మీడియాకు తెలిపారు. ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఏడు కళాశాలలు మంజూరు చేసింది. తెలంగాణ పరిధిలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు, వరంగల్ జిల్లా మేడారంలో నూతన కాలేజీలు ఏర్పాటు కానున్నారుు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో కోర్సులు ప్రారంభమవుతాయి. ఒక్కో విభాగానికి 60 సీట్లు కేటాయించారు.
వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ?
ప్రస్తుతం పాలిటెక్నిక్ కోర్సులకు సంబంధించిన కౌన్సెలిం గ్ ప్రక్రియ ముగిసి తరగతులు ప్రారంభమయ్యాయి. దీం తో ఈ ఏడాది అడ్మిషన్లకు ఏఐసీటీఈ నుంచి అనుమతి లభించడం కష్టమే. వచ్చే ఏడాది నుంచి ఈ కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయి. నూతన భవనాల నిర్మా ణం పూర్తయ్యేంత వరకు మేడారంలో అందుబాటులో ఉన్న గిరిజన గురుకుల కళాశాల భవనాలు లేదా అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాల్లో కళాశాలను నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం జిల్లా కేంద్రంలో రెండు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు ఉండగా, పరకాలలో 2008లో మరో కళాశాల మంజూరైంది. ఆ తర్వాత 2011లో చేర్యాలకు మరో కళాశాల మంజూరు చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటిచింది. అయితే ఇప్పటి వరకు పరకాల కళాశాల అద్దె భవనాల్లో కొనసాగుతుండగా చేర్యాల కాలేజీ ప్రకటనలకే పరిమితమైంది. కాగా, మేడారం కళాశాలకు మాత్రం ప్రారంభంలోనే భారీగా నిధులు మంజూరు కావవడంతో ఈ కాలేజీ భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తున్నాయి.