పేదలకు మెరుగైన వైద్యం
విశాఖపట్నం : బడుగు, బలహీన వర్గాల ప్రజ లకు మెరుగైన వైద్యం అందించేలా కేజీహెచ్‌ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. అందుకనుగుణంగా కేజీహెచ్‌లో అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రాష్ట్ర కేబినెట్ తొలి సమావేశంలో పాల్గొనేం దుకు నగరానికి వచ్చిన ఆయనను బీజేపీ నేత లు దసపల్లా హిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని మాట్లాడుతూ బుధవారం కేజీహెచ్, ఘోషా ఆస్పత్రులను స్వయంగా పరి శీలించానన్నారు.
ఎన్నో ఏళ్లుగా ప్రారంభోత్సవానికి నోచుకోని విమ్స్ ఆస్పత్రిని ఆరు నెలలోపు ప్రారంభిస్తామని లేదంటే ఎయిమ్స్ సహకారంతో నడుపుతామని మంత్రి హామీ ఇచ్చారు. నగరంలో సూపర్ హాస్పిటల్ ఏర్పాటు విషయం గురించి విలేకరులు ప్రస్తావించగా సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు కన్నా పేదలకు వైద్యం అందించడమే తమకు ముఖ్యమన్నారు. రాష్ట్ర విభజన విషయంలో రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరిగేలా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కృషి చేశారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రంగమోహన్, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు పి.వి. చలపతి రావు, నగర అధ్యక్షుడు పి.వి. నారాయణరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జె.పృథ్వీరాజ్, నాయకులు చెరువు రామకోటయ్య, నరేంద్ర, విమ్స్ ఆస్పత్రి వైద్యుడు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.