- చిత్తూరులో నీటి సమస్యపై జగన్ ఆందోళన
- ఇప్పుడే ఇలా ఉంటే రాష్ట్రం విడిపోతే పరిస్థితి ఏమిటి
- వైఎస్ బతికుంటే విభజన అనే మాట వినబడేది కాదు
- జగన్ ప్రసంగానికి విశేష స్పందన
సాక్షి, తిరుపతి: చిత్తూరు నగరంలో బిందె నీళ్లు రెండు రూపాయలకు విక్రయిస్తున్నారని తెలిసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడే ఇలా ఉంటే, రాష్ట్రం విడిపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఆయన చేపట్టిన మూడో విడత ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా ఎనిమిదో రోజైన ఆదివారం చిత్తూరు నగరంలో ప్రసంగించారు. ఆయన ప్రసంగం ఆద్యంతం ప్రజలను ఆకట్టుకుంది. వైఎస్ మరణం తరువాత రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవి కోసం దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నారని అనగానే ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డికి జేజేలు పలికారు. రాష్ట్రాన్ని విభజిస్తే చదువుకున్న వారు ఉద్యోగాల కోసం, రైతులు నీటి కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డిని, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడును కాలరు పట్టుకుని అడుగుతారా అనగా, అడుగుతామని సమాధానమిచ్చారు. రాష్ట్ర శాసనసభలో ప్రతిపాదన చేయకుండా, బిల్లును పంపించి చర్చించమనడం ఎంత అన్యాయం అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే సోనియా, కిరణ్, చంద్రబాబుకు రాష్ట్రంలోని 70 శాతం మంది ఉసురు తగులుతుందని అన్నారు.
రాష్ట్రంలో చర్చించాల్సిన ఆంశాలు అనేకం ఉండగా, రాష్ట్రం విడగొట్టేందుకు చర్చించమనడం దారుణమని అన్నారు. ప్రతి రైతు, విద్యార్థుల గుండెలు సమైక్యాంధ్ర అని కొట్టుకుంటున్నాయని అన్నారు. ప్రతి పేదవాడి మనసెరిగి ప్రవర్తించడమే రాజకీయమని, ఓట్ల కోసం సీట్ల కోసం రాజకీయం చేయరాదని అన్నారు. వైఎస్ జీవించి ఉంటే, విభజన అనే మాట వినబడేది కాదని అనగానే, వైఎస్‌ఆర్ అమర్హ్రే అని ప్రజలు నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, దీంతో ప్రతి కుటుంబం సంపాదన పెరిగి, బాగుపడతారని వైఎస్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఏర్పాటు చేశారన్నారు.
అనారోగ్యం వచ్చిన పేదవాడు పెద్ద ఆస్పత్రుల్లో చికిత్స చేసుకోవడానికి అప్పులు చేసి, వాటికి వడ్డీలు కట్టుకోలేక ఇబ్బంది పడకూడదనే ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేశారని అన్నారు. ప్రతి ఒక్కరికీ దివంగత నేత వైఎస్‌ఆర్ ఒక అన్నలా, ఒక తండ్రిలా వ్యవహరించారని అన్నారు. వైఎస్ గురించి జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతుంటే, ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. బహిరంగ సభకు చిత్తూరు సమన్వయకర్త ఏఎస్.
మనోహర్ అధ్యక్షత వహించగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి, నగరి సమన్వయకర్త ఆర్కే. రోజా, మహిళా కన్వీనర్ గాయత్రీదేవి, యువజన కన్వీనర్ ఉదయకుమార్, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ నాయకులు గాంధీ, తలుపులపల్లి బాబు రెడ్డి, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.