జననేతకు బ్రహ్మరథం | YS Jagan mohan reddy Samiyakashkaram Yataya 3rd day | Sakshi
Sakshi News home page

జననేతకు బ్రహ్మరథం

Published Tue, Dec 31 2013 3:04 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

YS Jagan mohan reddy Samiyakashkaram Yataya 3rd day

సమైక్య శంఖారావం చేపట్టిన వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పూలతో స్వాగతం పలుకుతూ, డప్పు వాయిద్యాల నడుమ నృత్యం చేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇప్పుడు తాము చల్లుతున్న పూలు జననేత అధికారంలోకి వచ్చాక తమకు పూల బాటలుగా మారుతాయని భావిస్తున్నారు.
 
సాక్షి, తిరుపతి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర మూడో రోజైన సోమవారం కూడా విజయవంతంగా నడిచిం ది. దారి పొడవునా ప్రజలు ఎల్లలులేని అభిమానంతో ఆయనకు స్వాగతం పలికారు. పూలు చల్లుతూ, డప్పు వాయిద్యాలతో, కోలాటం చేస్తూ జననేతకు ఆహ్వానం పలికారు. వేలమంది పాఠశాల విద్యార్థులు జగన్‌మోహన్‌రెడ్డికి నీరాజనాలు పలికారు.
 
ఆదివారం రాత్రి  చౌడేపల్లెలో బసచేసిన ఆయన సోమవారం ఉదయం బయలుదేరారు. బసచేసిన ఇంటి నుంచి అరకిలోమీటరు దూరంలోని బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహావిష్కరణ ప్రాంతానికి చేరుకోవడానికి రెండు గంటల సమయం పట్టింది. వందలాది మంది అభిమానులు జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్‌ను చుట్టుముట్టడంతో, ఎవరినీ నిరాశ పరచకుండా అందరినీ పలకరిస్తూ వచ్చారు. వైఎస్ విగ్రహావిష్కరణ చేసి కొద్దిసేపు ప్రసంగించాక, కొండామర్రి ప్రాంతానికి బయలు దేరారు. మార్గమధ్యంలో హైదరాబాద్ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం నాయకులు అయనను కలుసుకున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేలా సహకరించాలనే వారి కోరికను అంగీకరించారు.

అక్కడి నుంచి బయలుదేరగా మదనపల్లె మైనారిటీ నాయకులు అక్తర్ అహ్మద్ నాయకత్వంలో జననేతను కలుసుకున్నారు. దాదాపు 70 మసీదులకు చెందిన మత పెద్దలు, 30 మంది దర్గా కమిటీ సభ్యులు పలు వాహనాలతో బారులుతీరి నిలబడ్డారు. వారిని జగన్‌మోహన్‌రెడ్డి ఉర్దూలో పలకరించారు. రానున్న ఎన్నికల్లో ముస్లింలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరారు. దీనికి స్పందించిన ఆయన పీలేరులో 37,500 మంది ముస్లిం సోదరులు ఉన్నారని, మదనపల్లెలో 24 వేల మంది ఉన్నారన్నారు. తన నిర్ణయం ముస్లింసోదరులకు ఆమోదయోగ్యంగానే ఉంటుందని తెలిపారు.

అక్కడి నుంచి బయలుదేరిన ఆయనకు గుంటూరు మార్కెట్ యార్డుకు చెందిన 50 మంది నూతలపాటి హనుమయ్య నాయకత్వంలో కలుసుకున్నారు. అక్కడే సమీపంలో ఉన్న గుంటూరు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గానికి చెందిన దాదాపు 300 మందిని జననేత కలుసుకున్నారు. అనంతరం కొండామర్రికి చేరుకోగా ఆప్రాంతంలో నివసిస్తున్న సుగాలీలు జగన్‌మోహన్‌రెడ్డికి అఖండ స్వాగతం పలికారు. డప్పులు మోగిస్తూ, మహిళలు కూడా నాట్యం చేస్తూ ఆహ్వానించారు. అక్కడి నుంచి బయలుదేరిన ఆయన, బారులుతీరి నిలుచున్న విజయవాణి పాఠశాల విద్యార్థులను చూసి ఆగి వారిని పలకరించారు.

పిల్లల పేర్లు అడిగి తెలుసుకుని బాగా చదువుకోవాలంటూ దీవించారు. ఠాణా ఇండ్లు, బిల్లేరు క్రాస్ మీదుగా చింతమాకులపల్లె వద్ద వేచి ఉన్న అశేష జనవాహినిని కలుసుకున్నారు. అక్కడి నుంచి పుదిపట్ల గ్రామం చేరుకోగా, జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన బాల బాలికలు ఆహ్వానం పలికారు. పూలను ఆయనపై చల్లి అభిమానాన్ని చాటుకున్నారు. బోయకొండ క్రాస్ వద్దకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అనంతరం వైఎస్ మృతిని తట్టుకోలేక మరణించిన కణగాని ఆంజప్ప కుటుంబాన్ని ఓదార్చారు.  చదళ్ల, భగత్‌సింగ్ కాలనీల్లో రోడ్‌షో నిర్వహించి, పుంగనూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌కుమార్ రెడ్డి, అమరనాథరెడ్డి, సమన్వయకర్తలు ఆర్‌కే.రోజా, ఆదిమూలం, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, మహిళా కన్వీనర్ గాయత్రీదేవి, యువజన కన్వీనర్ ఉదయకుమార్, నేతలు పోకల అశోక్‌కుమార్, వై.సురేష్, వీరేంద్ర పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement