ఆశ చావని రైతు బంగాళాదుంప సాగుతో మరో సారి దెబ్బతినాల్సి వచ్చింది. గతంలో పంట సాగుచేసినా వర్షాల కారణంగా తీవ్ర నష్టాల్ని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పంట దిగుబడి పెరిగినా ధర పతనమవ్వడంతో అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వచ్చింది. పంటబీమా కూడా చేసుకోకపోవడంతో కుదేలవ్వాల్సిన దుస్థితి ఎదురైంది. చేసిన అప్పులు తీర్చలేక.. కొత్త అప్పులు పుట్టక రైతులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది.
పలమనేరు: జిల్లాలోని పడమటి మండలాలు చల్లదనానికి పెట్టింది పేరు. ఇక్కడ బంగాళాదుంప సాగుకు అనుకూలం. పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల్లో ఈ దఫా సుమారు 1,500 ఎకరాల్లో దుంపను సాగుచేశారు.
గతంలో తీరని నష్టం
మామూలుగా ఈ ప్రాంతాల్లో బంగాళాదుంపను రెండు అదునులుగా సాగుచేస్తారు. మొదటి అదునుగా గత ఏడాది సెప్టెంబర్‌లో.. రెండో అదునుగా నవంబర్, డిసెంబర్‌ల్లో సాగుచేశారు. అయితే నవంబర్‌లో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా భూమిలోపల దుంప సైజు పెరగలేదు. సగం పంట నీటిశాతం ఎక్కువై చేలళ్లోనే కళ్లిపోయింది. ఉన్న దుంపలు పచ్చటి రంగులోకి మారి పనికిరాకుండా పోయాయి. వర్షాలు తగ్గుముఖం పట్టాక తోటలు ఏపుగా పెరిగాయేగానీ పంట దిగుబడి మాత్రం గణనీయంగా తగ్గిపోయింది. రెండో అదనులో నాటిన తోటలు కూడా వర్షానికి సగం మాత్రమే మొలకెత్తాయి.
ఎకరాకు రూ.70 వేల పెట్టుబడి
బంగాళాదుంప సాగుచేసేందుకు రైతులు ఎకరాకు రూ.70 వేలదాకా ఖర్చు చేశారు. విత్తనాలు, ఎరువు లు, క్రిమిసంహారకమందు లు, సస్యరక్షణ తదితరాలకు భారీగానే పెట్టుబడులు పెట్టారు. అప్పట్లో విత్తనపు గడ్డ తుండు(42 కిలోలు) రూ.1500 దాకా తెచ్చి నాటారు. ఎకరాపొలానికి 15 తుండ్లు కావాలి. దీంతో రూ.22,500 విత్తనాలకు, ఎరువులకు మరో రూ.25 వేలు, క్రిమిసంహారకమందులకు ఇంకో రూ.15 వేలు, కూలీలు ఇతరత్రా ఖర్చులు రూ.8వేలు మొత్తం రూ.70 వేలు పంటకోసం వెచ్చించారు.
తుండుకు 5 బస్తాలు కూడారాని దిగుబడి
మామూలుగా పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తే తుండు విత్తనాలకు 20 నుంచి 22 బస్తాల దిగుబడి రావాలి. కానీ ఈ దఫా తుండుకు 5 నుంచి 7 బస్తాలు మాత్రమే వచ్చింది. దానికి తోడు దుంపల నాణ్యత తగ్గింది. ఆ లెక్కన ఎకరానికి 75 నుంచి 100 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. ఇప్పుడున్న ధర (తుండు రూ.550 నుంచి రూ.600) రూ.42 వేల నుంచి 60 వేల దాకా రైతులకు రాబడి వచ్చింది. పంట పెట్టుబడే రూ.70 వేలు అయితే వచ్చిన రాబడి రూ.42 నుంచి రూ.60 వేలు మాత్రమే. మొత్తమీద రైతులు ఎకరాకు రూ.30 వేలదాకా నష్టపోవాల్సి వచ్చింది.
నష్టం రూ.45 కోట్లు
ఎకరాకు రూ.30 వేలు నష్టం కాగా 1,500 ఎకరాలకు రూ.45 కోట్ల దాకా నష్టంమొచ్చింది. గతంలో రైతులు ఈ పంటకు కనీసం పంటల బీమా కూడా చేసుకోలేదు. దీంతో పూర్తిగా నష్టపోయారు. వేరుశెనగకు మాత్రం బీమా కట్టించుకున్న అధికారులు కూరగాయల పంటలను గురించి పట్టించుకోలేదు. అప్పులు చేసి పంటను సాగు చేసిన రైతన్నలు అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ ఎఫెక్ట్‌తో మళ్లీ పంటల సాగుకు బ్యాంకులు కొత్త రుణాలివ్వకుండా ముఖం చాటేస్తున్నాయి. కాల్‌మనీ వ్యవహారంతో ప్రవేటు వడ్డీ వ్యాపారులు సైతం అప్పులు ఇవ్వడం లేదు. దీంతో రైతన్నల పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది.
దుంప తెంచింది!
Published Sat, Jan 9 2016 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM
Advertisement