అమరజీవికి ఏపీసీసీ ఘనంగా నివాళి
హైదరాబాద్: అమరజీవి పొట్టి శ్రీరాములు పట్టువీడని మహనీయుడని, తెగింపు గలవాడని, ఆయన ఆశయాలు నేటి తరానికి స్పూర్తి దాయకమని ఏపీసీసీ పేర్కొంది. ఆంధ్రరాష్ట్ర సాధన కోసం పోరాడి, ప్రాణత్యాగం చేసిన మహాపురుషుడు అమరజీవి పొట్టి శ్రీరాములు 117 జయంతి జరుపుకోవడం గర్వించదగ్గ విషయం అని ఏపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం అన్నారు.
ఇందిరా భవన్‌లో విలేఖరుల సమావేశంలో గంగాధరం మాట్లాడుతూ... పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న నెల్లూర్ జిల్లాలోని పెద్దమట్టపల్లి గ్రామంలో జన్మించారు. శ్రీరాములు లాంటి అకుంటిత దీక్ష వ్యక్తులు 10 మంది ఉంటే మన దేశానికి సంవత్సర కాలంలోనే స్వాతంత్ర్యం తీసుకువస్తానని ఆనాడే మహాత్మాగాంధీ చెప్పారని మరొసారి గుర్తు చేశారు. అతని దేశభక్తికి, పట్టుదలకు గాంధీజీ మాటలే నిలువెత్తు సాక్ష్యాలన్నారు. అంతేకాక శ్రీరాములు ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారని గంగాధరం శ్రీరాములు దేశభక్తిని గుర్తు చేశారు.
ఆనాడు మద్రాస్ రాజధానిగా ఉన్నప్పుడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1952 అక్టోబర్ 19న నిరాహార దీక్షను ప్రారంభించారన్నారు. అతని 58 రోజుల దీక్షకు మద్దతుగా ప్రజలు ధర్నాలు, సమ్మెబాట పట్టారని ఆనాటి రోజులు గుర్తు చేశారు. కానీ శ్రీరాములు 1952 డిసెంబర్ 15న మరణించారు. అతని మరణ వార్త విన్నప్రజలు ఆవేశాలతో హింసాత్మక చర్యలకు పాల్పడి చెన్నై నుంచి విశాకపట్నం వరకు ఆందోళనలు చేశారని పేర్కొన్నారు. డిసెంబర్ 19న నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. ఆయన కృషి ఫలితంగా కర్నూల్ రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని చెప్పారు.