- విద్యుత్ చార్జీల పెంపుపై అన్ని వర్గాల్లో ఆగ్రహం
- జిల్లావాసులపై నెలకు రూ.15 కోట్ల మేర అదనపు భారం
- సర్కారు నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్
రాజమండ్రి: విద్యుత్ చార్జీలు పెంచినా పేదోడిపై భారం వేయలేదని, వంద యూనిట్ల లోపు వాడకానికి పెంపు వర్తించదని సర్కారు అంటోంది. అయితే ఎంత మంది వంద లోపు యూనిట్లు వాడతారు అని చూస్తే మాత్రం పెంపు భారం దాదాపు అందరిపై పడుతుందని తేలుతుంది. ప్రజలపై రాష్ట్రం మోపుతున్న వరుస భారాల్లో భాగంగా వచ్చే ఏప్రిల్ నుంచి కరెంటు చిర్జీలు పెంచేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఆ మేరకు విద్యుత్తు నియంత్రణా మండలి(ఈఆర్‌సీ) అనుమతి కోసం పంపిణీ సంస్థలు(డిస్కంలు) ప్రతిపాదనలు పంపాయి. వాటిని ఈఆర్‌సీ ఆమోదించడడం లాంఛనమే. ప్రభుత్వ నిర్ణయంపై జిల్లాలో అన్నివర్గాలూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
జిల్లాలో మొత్తం విద్యుత్తు వినియోగ దారుల సంఖ్య 14,39,670. ఇందులో గృహ కనెక్షన్లు 12.44,626, వాణిజ్య కనెక్షన్లు 1,17,194, పరిశ్రమల కనెక్షన్లు 9520, చిన్నతరహా పరిశ్రమల కనెక్షన్లు 864 ఉన్నాయి. మిగిలినవి వ్యవసాయ, ప్రభుత్వం, ప్రజాప్రయోజనాల సర్వీసులు, హెచ్‌టీ సర్వీసులు. వీరిలో చార్జీల పెంపు పేదలకూ భారం కానుంది. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 50 యూనిట్ల లోపు వినియోగదారులు 5.76 లక్షల మంది, 51 నుంచి 100 యూనిట్లలోపు వినియోగ దారులు 4.37 లక్షల మంది ఉన్నారు. ఈ సంఖ్య తాజా నెల బిల్లు ప్రకారం తేలింది. కాగా వీరి సంఖ్య నెల నెలా మారుతుంటుంది. వచ్చేది వేసవి కావడంతో ప్రతి ఇంటా వినియోగం భారీగా ఉంటుంది. ఒక ఫ్యాను వినియోగించే వారికి వంద యూనిట్లకుపైగా వినియోగం ఉంటుంది. అంటే ఏప్రిల్ తర్వాత లెక్కలు పూర్తిగా తారుమారవుతాయి. మార్చి నుంచి 51 నుంచి 100 యూనిట్లలోపు వాడే వారి సంఖ్య రెండు లక్షలకు తగ్గిపోతుంది.
భారం ఇలా పడుతుంది..
వందకు పైగా వినియోగించే ఐదు లక్షల మందిలో రెండు లక్షల మంది 101 నుంచి 200 యూనిట్ల లోపు వినియోగిస్తారు. వీరి వినియోగంపై 100 వరకూ ఇప్పుడున్న యూనిట్ ధరకు 0.12 పైసలు పెరుగుతుంది(రూ.2.60 నుంచి రూ.2.76). అంటే బిల్లుపై రూ.12 అదనంగా చెల్లించాలి. 101 నుంచి 200 వాడితే అదనం గా యూనిట్‌కు 0.22 పైసలు వడ్డిస్తారు (రూ.3.60 నుంచి రూ. 3.82) అంటే 200 యూ నిట్లు వాడే బిల్లుకు అదనంగా రూ.22 భారం పెరుగుతుంది. సగటున రెండు లక్షల మంది 150 యూనిట్లు వినియోగిస్తారని అంచనా వేస్తే రెండు లక్షల మందిపై నెలకు రూ.66 లక్షల భారం పడుతుంది. 201కి పైగా వినియోగించే వారి సంఖ్య సుమారు రెండు లక్షలని అంచనా. 300 యూనిట్లు వాడే వారు అదనంగా నెలకు రూ.130, 500 యూనిట్లు వాడే వారు అదనంగా రూ. 235 చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో 200 యూనిట్లకు మించి వాడే మూడు లక్షల మంది సగటున నెలకు 30 0 యూనిట్లు వినియోగిస్తే నెలకు రూ.మూడు కోట్ల మేర భారం పడనుంది. చిన్న దుకాణాల వారు సగటున 500 యూనిట్లు వినియోగిస్తారనుకుంటే నెలకు రూ.260 అదనపు భారం పడనుంది. జిల్లాలో ఈ తరహా 1,17,194 మంది వినియోగదారులపై అదనపు భారం రూ.మూడు కోట్లకు పైగా ఉంటుంది.
పరిశ్రమలపైనా పెనుభారం..
నెలకు 5,000 యూనిట్లు వినియోగించే కుటీర పరిశ్రమలపై నెలకు రూ.1200 అదనపు భారం పడుతుంది. జిల్లాలోని 864 పరిశ్రమలపై సుమారు రూ.10 లక్షలకు పైగా భారం పడుతోంది. కేటగిరీ-3 పరిశ్రమలపై నెలకు రూ.3.5 కోట్ల నుంచి రూ.4 కోట్ల భారం పడనుంది. పంచాయతీల వీధిదీపాలపై రూ.4 కోట్ల వరకూ, మంచినీటి పథకాలపై మరో మూడు కోట్ల వరకూ భారం పెరగనుంది. ఇతర వినియోగాలతో కలిపి చూస్తే చార్జీల పెరుగుదల వల్ల జిల్లా వాసులపై నెలకు రూ.13 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకూ అదనపు భారం పడనుంది.
ప్రజలు తట్టుకోలేరు..
టీడీపీ ప్రభుత్వం ఒకపక్క సంక్షేమ పథకాల్లో భారీగా కోత పెడుతూ, మరోపక్క అన్ని రకాల చార్జీలు పెంచుతోంది. ఈ వైఖరిని మేం ఖండిస్తున్నాం. ఇప్పటికే పెట్రోలు చార్జీలు పెంచేశారు. కొత్తగా కరెంటు బిల్లులు కూడా భారీగా పెరిగితే ప్రజలు తట్టుకోలేరు.
- జ్యోతుల నెహ్రూ, వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు
పేదలు ఫ్యాన్ వేసుకోకూడదా!
విద్యుత్తు చార్జీలు సామాన్యుడి నడ్డి విరుస్తాయి. వందకు పైగా వినియోగించే వారిలో పేదలు కూడా ఉంటారు. వేసవిలో ఫ్యాను వాడితే చాలు వంద యూనిట్లు దాటిపోతుంది. అంటే పేదవాళ్లు వేసవిలో ఫ్యానులు కూడా వేసుకోకుండా ఉండాలని ప్రభుత్వ ఉద్దేశమా!
- పి. సూర్యనారాయణరాజు, రిటైర్డు ఉద్యోగి, రాజమండ్రి