'పుట్టినరోజున కూడా అచ్చెన్నాయుడు అబద్ధాలు'
పుట్టినరోజు నాడైనా నిజాలు చెబుతారని అనుకుంటే.. ఆరోజు కూడా అచ్చెన్నాయుడు అబద్ధాలే చెబుతున్నారని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా విద్యుత్ సంస్కరణల బిల్లు మీద జరిగిన చర్చలో ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో తొమ్మిదిసార్లు విద్యుత్ చార్జీలు పెంచగా, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఒక్కసారి కూడా పెంచని విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు కూడా విద్యుత్ చార్జీలను దారుణంగా పెంచుతున్నారని, ఏపీ డిస్కంలు ఎక్కువ రేట్లకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోందని ఆయన అన్నారు. పవర్ ఎక్స్చేంజిలలో తక్కువ ధరకే విద్యుత్ అందుబాటులో ఉన్నా దాన్ని వదిలేసి ఎక్కువ ధరకు సుదీర్ఘ కాలం పాటు కొంటున్నారని ఆడిట్ సంస్థలే తప్పుబట్టాయని తెలిపారు.
విద్యుత్ కొనుగోళ్ల కోసం ఎక్కువ ధర పెడుతున్నాయని ఏపీఈఆర్‌సీకి ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజి లేఖ కూడా రాసిందని అన్నారు. రోజుకు 24 గంటల పాటు యూనిట్‌కు రూ. 2.71 చొప్పున, రాత్రి సమయాల్లో అయితే రూ. 1.90 చొప్పున అందుబాటులో ఉన్నా.. ప్రభుత్వం మాత్రం ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ. 5.11 చొప్పున యూనిట్ విద్యుత్ కొంటోందని చెప్పారు. బొగ్గు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్నా కూడా పాతరేట్లకే కొనుగోలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో బషీర్ బాగ్ లో పిట్టల్ని కాల్చినట్లు కాల్చేశారని, ఆ విషయం ఇప్పటికీ అందరికీ గుర్తేనని తెలిపారు. వైఎస్ తర్వాత వచ్చిన కిరణ్ సర్కారు కూడా విద్యుత్ చార్జీలు పెంచిందని.. అది కూడా తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వమేనని, తాము అవిశ్వాసం పెడితే చంద్రబాబు నాయుడు విప్ తమ సభ్యులకు జారీచేసి మరీ ఆ ప్రభుత్వాన్ని కాపాడారని ఆయన అన్నారు.