కమ్ముకొస్తున్న చీకట్‌లు!
శ్రీకాకుళం: వర్షాకాలం వచ్చినా జిల్లా ప్రజలకు విద్యుత్ కష్టాలు తీరేలా లేవు. ఒకవైపు వర్షాలు లేక ఎండల తీవ్రత, ఉక్కపోత వేధిస్తుంటే.. మరోపక్క విద్యుత్ సంక్షోభం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే వేళాపాళా లేని విద్యుత్ కోతలతో ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. తాజాగా విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు నిండుకొని, ఉత్పత్తి నిలిచిపోతుండటంతో పూర్తిగా చీకట్లు అలుముకొనే ప్రమాదం కనిపిస్తోంది. మంగళవారం నుంచే విద్యుత్ అంతరాయాలు మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. జిల్లాకు ఆదివారం వరకు ప్రతిరోజు మూడు లక్షల మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అయ్యేది. అంతకు ముందు 3.4 లక్షల మిలియన్ యూనిట్లు సరఫరా చేసేవారు.
అది జిల్లా అవసరాలకు సరిపోయేది. విద్యుత్ కొరత కారణంగా 40 వేల మిలియన్ యూనిట్లు తగ్గించడంతో జిల్లా అధికారులు ఆదివారం వరకు రెండు మూడు గంటలు అధికారికంగానూ గంట నుంచి రెండు గంటల వరకు అనధికారికంగానూ కోతలు విధించి సర్దుబాటు చేస్తూ వచ్చారు. సోమవారం నుంచి పరిస్థితి మరీ దిగజారింది. 2.15 లక్షల మిలి యన్ యూనిట్లు మాత్రమే జిల్లాకు అందడంతో నాలు గు గంటలకుపైగా అధికారికంగా కోత విధించారు. మరో గంటపాటు విద్యు త్ మరమ్మతుల పేరిట సరఫరా నిలి పివేశారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు కొరత కారణంగా మంగళవా రం నుంచి విద్యుత్ ఉత్పాదన దాదాపు నిలిచిపోయే పరిస్థితి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
అదే జరిగితే జిల్లాకు మరో 70 వేల మిలియన్ యూనిట్ల వరకు సరఫరా తగ్గిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పట్టణాల్లో కూడా ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు కోతలు విధించక తప్పదని అంటున్నారు. సరఫరా పరిస్థితిని బట్టి కోత సమయాన్ని పెంచే అవకాశాలు కూడా లేకపోలేదు. విద్యుత్ సరఫరా తగ్గడంతో పరిశ్రమల్లో విద్యుత్ వినియోగంపై సాయంత్రం నుంచి ఉదయం ఏడు గంటల వరకు ఆంక్షలు విధించారు. విద్యుత్ కోతలు ఇంత భారీస్థాయిలో ఉంటాయని తెలుసుకొని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గృహ అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన కొద్దిరోజులకే పరిస్థితి దారుణంగా తయరవడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి అయినా గృహాలకు కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు.