మరో మూడు రోజులు... మాడుపగిలేలా...
విజయనగరం వ్యవసాయం: వడదెబ్బను హెల్త్ ఎమర్జెనీగా పరిగణిస్తారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా అధికార యంత్రాంగం మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ప్రజలను అప్రమత్తం చేయాల్సిన వైద్య ఆరోగ్యశాఖ నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహారిస్తోంది. ఆ శాఖకు చెందిన హెల్త్ అసిస్టెంట్ వడదెబ్బకు మృతి చెందిన ప్పటికీ ఇంకా కళ్లు తెరవలేదు. వడదెబ్బ బారిన పడకుండా గ్రామీణులను అప్రమత్తం చేయాల్సిన అధికారులు అటువంటి ప్రయత్నాలేమీ చేయకపోవడంతో జనం మండిపడుతున్నారు. వడదెబ్బ కారణంగా జిల్లా వ్యాప్తంగా గురువారం నలుగురు, శుక్రవారం 16 మంది, శనివారం 17 మంది మృత్యువాత పడ్డారు. దీనిని బట్టిపరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. ఎండవేడిమికి, విద్యుత్ కోతలు తోడవడంతో జనం విలవిల్లాడిపోతున్నారు. చాలా మంది ఇళ్లు వదలి చల్లని ప్రదేశాలకు వెళ్లిపోతున్నారు.
ఆస్పత్రులు కిటకిట..
వడదెబ్బకు జ్వరాలు బారిన పడిన వారితో ఆస్పత్రులు కిటకిటాలాడుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు వార్డులు అయితే మంచాలు ఖాళీ లేని పరిస్థితి. రోజూ రోగుల సంఖ్య పెరగడమే గాని తగ్గడం లేదు. శనివారం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే గాల్లో తేమ శాతం తగ్గిపోవడంతో వడగాడ్పులుకు జనం భరించలేక మృత్యువాత పడుతున్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితిని ఇంతకు ముందు చూడలేదని 80, 90 ఏళ్లు వృద్ధులు సైతం చెబుతున్నారు.
వడదెబ్బలపై ఎటువంటి ప్రకటనా చేయని ప్రభుత్వం
వడదెబ్బ కారణంగా మృత్యువాత పడిన వారిపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడం చర్చనీయాంశమైంది. పేదల సంక్షేమమే తమ ధ్యేయమని గొప్పలు చెప్పిన ప్రభుత్వం జనం పిట్టల్లా రాలుతున్నా ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రతీది భారంగా భావించే ప్రభుత్వం ప్రకృతి కన్నెర్ర కారణంగా మృత్యువాత పడిన వారిపట్ల సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
రెండు, మూడు రోజుల పాటు ఇంతే...
ఇదే పరిస్థితి రెండు, మూడు రోజుల పాటు ఉండే అవకాశం ఉందని ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ పి.గురుమూర్తి తెలిపారు. వాతావరణంలో ఎటువంటి మార్పులూ లేకపోవడం వల్ల ఎండ వేడిమి రెండు, మూడు రోజులు ఈ విధంగానే ఉండే అవకాశం ఉందని చెప్పారు.