- సా...గుతున్న విద్యుత్ పునరుద్ధరణ పనులు
- వందలాది సిబ్బందితో అధికారుల హడావుడి
- ఎనిమిది రోజులుగా ఒక్క ప్రాంతానికి జరగని సరఫరా
- తాగునీరు, వైద్యం అందక జనం అవస్థలు
నర్సీపట్నం టౌన్ : విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. హుదూద్ తుపాను వచ్చి వారంరోజులు గడిచినా నేటికీ నర్సీపట్నం, పరిసర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా లేక జనం కటిక చీకట్లో అవస్థలు పడుతున్నారు. వందలాది మంది సిబ్బంది పనిచేస్తున్నా ఏ ఒక్క ప్రాంతానికి కూడా విద్యుత్ అందించలేకపోతున్నారు.
వారం రోజులుగా అధికారుల హడావుడి తప్ప ప్రయోజనం శూన్యం. తుపాను వల్ల నర్సీపట్నం ప్రాంతంలో భారీ నష్టం వాటిల్లింది. విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్దరించేందుకు అధిక సంఖ్యలో సిబ్బందిని ఇతర జిల్లాల నుంచి తీసుకువచ్చినప్పటికీ పనులు చేయించడంలో విఫలమయ్యారు.
ప్రధానంగా నర్సీపట్నానికి కొరుప్రోలు నుంచి విద్యుత్ సరఫరా అయ్యే ప్రధాన లైన్ మరమ్మతులు కూడా నేటికీ ఒక కొలిక్కి రాలేదు. ప్రత్యామ్నాయంగా కశింకోట నుంచి విద్యుత్‌ను తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ లైన్‌లో ఏర్పడిన కొద్దిపాటి మరమ్మతులను కూడా చేయలేకపోయారు. ఎనిమిది రోజులుగా విద్యుత్ లేక ప్రజలు తాగునీరు, వైద్యసేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు.
కనీసం ప్రాంతాలవారీగానైనా విద్యుత్తును పునరుద్దరిస్తే కొందరికైనా ఉపశమనం కలిగి ఉండేది. అధికార యంత్రాంగం కూడా దీనిపై పెద్దగా దృష్టిసారించకపోవడం వల్ల విద్యుత్ పునరుద్ధరణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కొనసాగుతున్నాయి. నేడో, రేపో విద్యుత్ సరఫరా చేస్తామని విద్యుత్ శాఖాధికారులు ఒకపక్క ప్రకటనలిస్తుండగా... మరోపక్క మరో నాలుగురోజులు పడుతుందని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు.