రెండో రోజూ ‘కట్ కటే..
ఆమె పేరు భాగ్యమ్మ. భర్త ఇంట్లో జారిపడటంతో కాలు విరిగింది. నడవలేని స్థితిలో ఉన్న ఆయనను తీసుకుని కాటేదాన్ నుంచి మంగళవారం ఉస్మానియా ఆస్పత్రికి వచ్చింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు నిరీక్షణే తప్ప చికిత్స అందలేదు. ఎక్స్‌రే తీయడానికి కరెంట్ లేదని, బుధవారం రమ్మని చెప్పి వైద్యులు పంపేశారు. ఇదీ పేరు గొప్ప ఉస్మానియా ఆస్పత్రిలో నెలకొన్న దుస్థితి. ఇక్కడ రెండో రోజూ చీకట్లు అలుముకున్నాయి. మొదటి రోజు అనుభవంతోనైనా పరిస్థితిని ఆస్పత్రి వర్గాలు చక్కదిద్దలేదు. ఒకపక్క కరెంట్ కోత.. మరోపక్క ఉక్కపోత.. ఫలితంగా రోగులు, వారి సహాయకులు నానా అవస్థలు పడ్డారు.
అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: ఉస్మానియా ఆసుపత్రిలో రెండవ రోజూ విద్యుత్ అంతరాయం కొనసాగడంతో వైద్య సేవలు స్తంభించాయి. ఫలితంగా సకాలంలో వైద్యం అందక రోగులు, వారి సహాయకులు తీవ్ర అవస్థలు పడ్డారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉస్మానియా ఓపీ భవనంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆసుపత్రిలోని క్యాజువాల్టీ, ఏబీసీ వార్డు, ఏఎంసీ, ఏఎన్‌ఎస్‌సీ, మీకో వార్డుల్లో చికిత్సలతో పాటు ఎంఓటీ, ఈవోటీలలో శస్త్రచికిత్సలకు తీవ్ర అంతరా యం కలిగింది. మంగళవారం నిర్వహించాల్సిన పలు శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి.
ఎక్స్‌రే, ఈసీజీ, సిటీస్కాన్, అల్ట్రాసౌండ్ తదితర రోగ నిర్ధారణ పరీక్షలు సైతం నిలిచిపోవడంతో ఆయా పరీక్షలు నిర్వహించాల్సిన రోగులను గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. సోమవారం ఉదయం నుంచి విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో సంబంధిత అధికారులు అర్ధరాత్రి వరకు శ్రమించినా విద్యుత్ సమస్యకు కారణం అంతుచిక్కలేదు.
సోమవారం రాత్రంతా విద్యుత్ సరఫరా లేకపోవడంతో జనరేటర్ సహాయంతో సరఫరాను పునరుద్ధరించినా.. కొన్ని వార్డులకే పరిమితమైంది. దీంతో విద్యుత్ లేని వార్డుల్లో రాత్రంతా దోమలతో జాగారం చేయాల్సి వచ్చిందని పలువురు రోగులు వాపోయారు.
మంగళవారం ఉదయం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్.సి.జి. రఘురాం, అదనపు సూపరింటెండెంట్ డాక్టర్.పి. మైథిలీలు ఓపీ భవనాన్ని సందర్శించి వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.ఏపీఎస్‌ఎంఐడీసీ విద్యుత్ విభా గం ఈఈ రాంప్రసాద్, డీఈ కృష్ణ, ఏఈ విజయ్‌కుమార్, ఏపీసీపీడీసీఎల్ బేగంబజార్ అధికారులు, సిబ్బంది సాయంత్రం 5 గంటల వరకు మరమ్మతులు నిర్వహించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, రోగులు ఊపిరి పీల్చుకున్నారు.