సమ్మెను మరింత ఉధృతం చేస్తాం | We will further intensify strike | Sakshi
Sakshi News home page

సమ్మెను మరింత ఉధృతం చేస్తాం

Published Sun, Jul 12 2015 11:47 PM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM

We will further intensify strike

జోగిపేట : సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఉద్యమిస్తామని, సమ్మెను మరింత ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజయ్య స్పష్టం చేశారు. మున్సిపల్ కార్మికులు వారం రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ర్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.  ఇందుకు నిరసనగా ఆదివారం జోగిపేటలో ప్రభుత్వ దిష్టిబొమ్మను ప్రదర్శన నిర్వహించి అనంతరం హనుమాన్ చౌరస్తాలో దహనం చేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ సోమవారం నుంచి జిల్లా అంతటా అన్ని మున్సిపాలిటీలలో నీరు, విద్యుత్ సరఫరాలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రజలకు జరిగే అసౌకర్యాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ మొండి వైఖరి వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు పన్నుతోందని ఆరోపించారు. ఉపాధి హామీ సిబ్బంది నెల రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ ఆందోళన కార్యక్రమా లు చేపడుతామన్నారు. కార్యక్రమంలో సీఐ టీయూ డివిజన్ కార్యదర్శి పి.మొగులయ్య, నగర పంచాయతీ నాయకులు రాములు,సుభాష్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు

 సమ్మె కొనసాగిస్తాం
 సంగారెడ్డి మున్సిపాలిటీ :మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తామని సీఐటీయూ పట్టణ కార్యదర్శి మహబూబ్‌ఖాన్ తెలిపారు. ఆదివారం మున్సిపల్ కార్మికుల సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. పట్టణంలోని స్ట్రీట్‌లైట్లు, వీధి దీపాలను బంద్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదని ఆరోపించారు.  

 సిద్దిపేటలో మోకాళ్లపై నిరసన..
 సిద్దిపేట జోన్‌ః డిమాండ్ల సాధన కోసం సిద్దిపేట మున్సిపల్ కార్మికులు ఆదివారం కళ్లకు గుడ్డలు కట్టుకొని మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ డివిజన్ ప్రదాన కార్యదర్శి రేవంత్‌కుమార్, కార్మిక సంఘం నాయకులు రాజు, నర్సింలు,రాజయ్య, రాములు, తిరుపతి, రామస్వామి, వినోద, లత, ఎల్లవ్వ తదితరులు పాల్గొన్నారు.

 రెగ్యులరైజ్ చేయాల్సిందే..
 మెదక్‌టౌన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కాంట్రాక్ట్ పద్ధతి లేకుండా చేసి అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బి.శ్రీనివాస్ ఆరోపించారు. హక్కుల సాధన కోసం మున్సిపల్ ఔట్‌సోర్సింగ్,  కాంట్రాక్ట్ కార్మికులు మెదక్ మున్సిపల్ కార్యాలయం ముందు చేస్తున్న ఆందోళన ఆదివారం 7వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా  బి.శ్రీనివాస్ మాట్లాడుతూ యేళ్ల తరబడి మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందన్నారు.

కార్మికులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని  డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించారని అన్నారు. కార్మిక చట్టం ప్రకారం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్టర్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు చిత్తారి శ్రీను, సంజీవ్, జీవన్, శ్యాంసుందర్, సత్యం, నాగరాజు, శ్రీనివాస్, వినయ్‌కుమార్, దుర్గాగౌడ్, శ్రీనివాస్, సదానంద్, కార్మికులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement