విశాఖపట్నం : తుపాను కారణంగా విద్యుత్ వ్యవస్థకు రూ. వెయ్యి కోట్ల నష్టం వాటిల్లిందని ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. ఆ నష్టంలో 80 శాతం విశాఖ నగరంలోనే జరిగిందని తెలిపారు. బుధవారం విశాఖపట్నంలో అజయ్ జైన్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఈ రోజు రాత్రికి 50 నుంచి 70 వేల మందికి విద్యుత్ ఇవ్వగలమన్నారు. పూర్తి స్థాయిలో కరెంట్ సరఫరాకు మరో నాలుగు రోజుల సమయం పడుతుందని వెల్లడించారు. రేపు ఉదయం స్టీల్ ప్లాంట్, ఎయిర్ పోర్ట్లకు కరెంట్ ఇస్తామన్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ట్రాన్స్ఫార్మర్లను తెప్పిస్తున్నామని చెప్పారు. విశాఖ ఒక్క నగరంలోనే విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు 2 వేల మంది సిబ్బంది పని చేస్తున్నారన్నారు.
గాజువాక సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ను ఇప్పటికే పునరుద్ధరించామన్నారు. ఈ రోజు సాయంత్రంలోగా నక్కవారిపాలెం సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ను పునరుద్ధరిస్తామని తెలిపారు. విశాఖ జిల్లాలో పలు 130 కేవీ సబ్ స్టేషన్లను పునరుద్ధరించినట్లు చెప్పారు. ముందస్తు చర్యల వల్ల ప్రాణనష్టం బాగా తగ్గించ గలిగామని అజయ్ జైన్ వెల్లడించారు. హుదూద్ తుపాన్తో ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలు అతలాకుతలమైనాయి. ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో గత మూడు రోజులుగా విశాఖపట్నంతోపాటు పలు ప్రాంతాలలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో కరెంట్ సరఫరాను పునరుద్దరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
హుదూద్తో విద్యుత్ శాఖకు వెయ్యి కోట్ల నష్టం
Published Wed, Oct 15 2014 1:28 PM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM
Advertisement
Advertisement