సాక్షి ప్రతినిధి, విజయనగరం : టీడీపీ అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల బలోపేతం కోసం తొలి సంతకం పెడతా.. స్థానిక సంస్థలకు అధికారాలన్నీ బదలాయిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఇదే అంశాలను తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. తీరా అధికారంలోకి వచ్చాక స్థానిక ప్రభుత్వాలు, అధికారాల బదలాయింపు పక్కన పెట్టి ఉన్న అధికారాలను తీసేసారు. జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి కార్యకర్తలతో సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలగా మార్చేసి తమ అనుచరగణంతో కూడి జన్మభూమి కమిటీలతో పెత్తనం చెలాయిస్తున్నారు. కొత్తవి ఇవ్వలేదు సరికదా ఉన్నవి లాక్కున్న పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడీ పరిస్థితుల్లో స్థానిక అధికారాల బదలాయింపు విజయోత్సవాలంటూ వారోత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడా ఉత్సవాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఐఏఎస్ అధికారి ఎ.ఎన్.నారాయణన్ శుక్రవారం జిల్లా కొస్తున్నారు. మూడు రోజులు పాటు జిల్లాలో జరగనున్న వివిధ గ్రామ సభల్లో పాల్గోనున్నారు. ఇప్పుడా అధికారి వాస్తవ పరిస్థితులనలు తెలుసుకుని కేంద్రానికి నివేదిస్తే స్థానిక సంస్థలకు కాసింతైనా మేలు జరుగుతుందేమోనని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆశిస్తున్నారు.
స్థానిక సంస్థలే పునాది..
గ్రామ స్వరాజ్యం జాతిపిత కల. ప్రజా స్వామ్యానికి స్థానిక సంస్థలే పునాదులు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతమైతే దేశాభివృద్ధి సాధ్యమని మహాత్మగాంధీ పిలుపునిచ్చారు. అతని ఆశయాన్ని కార్యరూపం దాల్చేందుకు ఎంతో మంది నేతలు కృషి చేశారు. అందులో భాగంగా 1993లో నాటి ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు 73వ రాజ్యాంగ సవరణ చేశారు. 243(జీ11వ) షెడ్యూల్ ప్రకారం 29 శాఖల అధికారాలను బదలాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. సవరణ చేసి 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్రప్రభుత్వం పంచాయతీరాజ్ వారోత్సవాలు నిర్వహించేందుకు పిలుపునిచ్చింది. జిల్లాలో ఎక్కడికక్కడ గ్రామసభలు నిర్వహిస్తున్నారు.
ఒక్క అధికారమూ బదలాయించలేదు
వాస్తవానికైతే 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం 29 శాఖల అధికారాల్లో ఒక్కటీ కూడా మన స్థానిక సంస్థలకు బదలాయింపు కాలేదు. నిధులు, అధికారాలు, సిబ్బంది, ప్రణాళికలు లెక్కన అధికారాల బదలాయింపుల్లో కేరళ మొదటి స్థానంలో ఉండగా మన రాష్ట్రం చివరి స్థానంలో నిలిచింది. మిగతా రాష్ట్రాల్లో కొన్నైనా అమలైనా ఇక్కడ బదలాయింపు ఊసేలేదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 అధికారాలు బదలాయింపు జరిగాయి. వాటికి ఇప్పుడు తూట్లు పొడిచేసి స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసేశారు.
జన్మభూమి కమిటీలతో నాశనం చేసేస్తున్నారు. పింఛన్ల లబ్ధిదారుల ఎంపిక- పంపిణీ, ఇళ్లు మంజూరు, రుణ లబ్ధిదారుల ఎంపిక, నీరు - చెట్టు పనుల ప్రతిపాదనలు, ఉపాధి హామీ పథకం పనులు...ఇలా అన్ని రకాల అధికారాలను జన్మభూమి కమిటీలు పూర్తిగా హైజాక్ చేసేసాయి. దీంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తోంది. రాజ్యాంగ విరుద్ధంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ స్థానిక సంస్థల ప్రతినిధుల్ని జీరో చేసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీరాజ్ వారోత్సవాలు అంటూ గ్రామసభలు నిర్వహించడంపై సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాకు వస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి
పంచాయతీరాజ్ వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న గ్రామసభల తీరుతెన్నులను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఐఏఎస్ అధికారి ఎ.ఎన్.నారాయణన్ జిల్లాకు వస్తున్నారు. ఈనెల 22న బొబ్బిలి మండలం మెట్టవలసలో , డెంకాడ మండలం పెదతాడివాడ, 23న కురుపాం మండలం మొండెంఖల్లు, నెల్లిమర్ల మండలం దాసన్నపేటలో జరిగే గ్రామసభల్లో పాల్గొంటారు. ఏదో వచ్చి వెళ్లేదాని కన్నా అధికారాల బదలాయింపు నిజంగా జరిగిందా లేదా అన్నది పరిశీలించి, కేంద్రానికి నివేదిస్తే స్థానిక సంస్థలు మేలు జరుగుతుందని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
సిగ్గు చేటు..
Published Fri, Apr 22 2016 12:05 AM | Last Updated on Sat, Aug 11 2018 4:02 PM
Advertisement
Advertisement