నేడు ప్రకాశం బ్యారేజి వద్ద ధర్నా
Published Sat, Nov 30 2013 3:01 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
చిలకలూరిపేట,న్యూస్‌లైన్ :కర్ణాటకలోని ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పునకు నిరసనగా శనివారం ఉదయం 10 గంటలకు ప్రకాశం బ్యారేజి వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ చెప్పారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కృష్ణాడెల్టా, సాగర్ కుడి, ఎడమ కాల్వల పరిధిలో ఉన్న సాగు భూములకు నీరు అందని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తీర్పు ప్రభావం సాగర్ నుంచి హైదరాబాద్‌కు ఏర్పాటు చేస్తున్న పైపులైన్ నిర్మాణం, ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్ట్, రాయలసీమలో హంద్రీ నీవా తదితర ప్రాజెక్టులపై పడే ప్రమాదం ఉందన్నారు.
రాష్ట్రానికి వచ్చే జలాలను చె న్నైకు పంపిణీ చేయాల్సి ఉంటుందని ఇది రాష్ట్రంలో తీవ్రప్రభావం చూపుతుందన్నారు. చంద్రబాబు హయాంలోనే ఆలమట్టి డ్యామ్ ఎత్తు నిలిపి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలు వినిపించటంలో విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తీర్పు నిలుపుదలకు ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేశారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లే తీర్పుపై సమైక్యంగా పోరాటం చేయాలని సూచించారు. శనివారం ప్రకాశం బ్యారేజి వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, రైతులు, మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఆ ఇద్దరివల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి వైఎస్సార్‌సీపీ నేత ఆర్కే
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కృష్ణానది నీటి కేటాయింపులపై ఏర్పాటైన బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట సరైన విధంగా వాదనలు వినిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా, గుంటూరు జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అభిప్రాయపడ్డారు. అసమర్థుడైన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, సత్తా లేని ప్రతిపక్షనేత చంద్ర బాబు నాయుడుల చేతగాని తనం వల్లనే రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. బ్రజేశ్‌కుమార్ తీర్పుపై వ్యాఖ్యానించడం సబబు కాకపోయినా, ఈ విషయంలో బాబు, కిరణ్ ఇద్దరూ తీవ్ర అలసత్వాన్ని కనబరిచారని అన్నారు. ఆల్మట్టి డ్యాం నిర్మాణ సమయంలో కేంద్రంలో చక్రం తిప్పానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు రాష్ట్రానికి వ్యతిరేకంగా తిప్పారని అర్థమైందన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు బస్ తీసుకున్నట్లు పదేపదే సోనియా దగ్గరకు రాకపోకలు సాగించే సీఎం రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి మాదిరిగా వ్యవహరించడం రాష్ట్రానికి చేటు తెచ్చిందన్నారు. ఈ పరిస్థితుల్లో మనం సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవడం ఒక్కటే మార్గమన్నారు
Advertisement
Advertisement