
ప్రకాశం జిల్లా వాసికి రూ.కోటి ఫెలోషిప్
ప్రతిభతో ప్రతిష్టాత్మకమైన ఐక్యరాజ్యసమితి ఫెలోషిప్‌నకు ఓ తెలుగు యువకుడు అర్హత సాధించాడు.
హైదరాబాద్: ప్రతిభతో ప్రతిష్టాత్మకమైన ఐక్యరాజ్యసమితి ఫెలోషిప్‌నకు ఓ తెలుగు యువకుడు అర్హత సాధించాడు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కుమ్మిత రామకృష్ణారెడ్డి జపాన్‌లోని యునెటైడ్ నేషన్స్ యూనివర్సిటీ పోస్ట్‌డాక్టొరల్ ఫెలోషిప్‌నకు ఎంపికయ్యారు. 200 మంది పోటీపడగా రామకృష్ణారెడ్డితో పాటు మరొకరు మాత్ర మే అర్హత సాధించారు. ఆయన ప్రస్తుతం టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
ఈ ఫెలోషిప్ కింద ‘సోషల్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్, సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర అభివృద్ధి’ అంశంపై రెండేళ్ల పాటు ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో అత్యల్ప వృద్ధి ఉన్న పది దేశాల్లో పరిశోధన చేయనున్నారు. ఇందుకోసం ఆయనకు రూ.కోటి ఫెలోషిప్‌గా అందుతుంది. రామకృష్ణారెడ్డి ప్రకాశం జిల్లాలో ఇంటర్, కర్నూలు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలలో బీఏ చదివారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ చేశారు.
నిర్లక్ష్యానికి గురైన సామాజిక సమస్యల పరిష్కారానికి సోషల్ ఎంటర్ ప్రెన్యూర్స్ చేస్తున్న కృషిని అర్థం చేసుకుని, విభిన్న చర్యల ద్వారా సుస్థిర అభివృద్ధికి, ఐక్యరాజ్యసమితి విధాన రూపకల్పనకు తన పరిశోధన ఉపయోగపడుతుందని రామకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.