ప్రకాశంలో ఓటెత్తిన జనం | Prakasam District Voting Percentage Of 2019 Elections | Sakshi
Sakshi News home page

ప్రకాశంలో ఓటెత్తిన జనం

Published Fri, Apr 12 2019 8:41 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

Prakasam District Voting Percentage Of 2019 Elections - Sakshi

పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంలకు సీల్‌ వేస్తున్న ఎన్నికల నిర్వహణ సిబ్బంది

ఊరు వాడా కదిలొచ్చింది. ప్రజా చైతన్యం ఓటెత్తింది. పూటకో మాట, రోజుకో వేషం వేసే వంచన రాజకీయానికి..అవినీతి, అక్రమాలతో జనాన్ని దోచుకుని నిరంకుశ పాలన సాగించిన నేతల దాష్టీకానికి చరమగీతం పాడేందుకు ముందుకొచ్చింది. దగాపడిన బడుగు జీవుల తలరాతను మార్చే నేత కోసం.. మార్పు కోసం.. విశ్వసనీయతకు పట్టం కట్టేందుకు జనం తరలివచ్చారు. పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు, యువత ఓపిగ్గా గంటల తరబడి క్యూలలో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 

సాక్షి, ఒంగోలు సిటీ: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గురువారం జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు పోటెత్తారు. స్వచ్ఛందంగా ఓటు వేసుకోవడానికి కేంద్రాల వద్ద బారులుతీరారు. ఈవీఎంల ఓటింగ్‌ సజావుగా సాగింది. అక్కడక్కడా చెరుదుమదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. జిల్లా కేంద్రం ఒంగోలు నుంచి జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌ వినయ్‌చంద్, బాపట్ల రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.నాగలక్ష్మిలు పోలింగ్‌ సజావుగా జరిగేలా పర్యవేక్షించారు. వీరు మధ్యలో కొన్ని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల పరిశీలకులు ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం నుంచి లైవ్‌ టెలికాస్ట్‌ అనుసంధానం కావడంతో జిల్లా ఎన్నికల అధికారి మీడియా సెంటర్‌ నుంచి పరిశీలించారు. అక్కడికక్కడే సంబంధిత రిటర్నింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పోటెత్తిన ఓటర్లు
జిల్లాలో మొత్తం 26,32,407 మంది ఓటర్లు ఉన్నారు. 3269 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఉదయం 5.30 గంటలకు మాక్‌ పోలింగ్‌ను ప్రారంభించారు. ఏజెంట్లు, అధికారులు ఉదయం మాక్‌పోలింగ్‌లో పాల్గొన్నారు. సుమారు 300 పోలింగ్‌ కేంద్రాల్లో మాక్‌పోలింగ్‌ సమయంలోనే సమస్యలు వచ్చాయి. కొన్ని కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు మరి కొన్ని కేంద్రాల్లో 9 గంటలకు కొలిక్కి వచ్చాయి. ఒంగోలు కేంద్రంలో పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద మాక్‌ పోలింగ్‌ మూడు గంటల ఆలస్యంగా మొదలైంది. అప్పటి దాకా ఓటర్లు ఓపికగా వేచి ఉన్నారు.

జిల్లాలో నమోదైన పోలింగ్‌ శాతం - 85.82 శాతం

నియోజకవర్గం నమోదైన పోలింగ్‌ శాతం
వై పాలెం 86.4
చీరాల 83.98
మార్కాపురం 85.31
దర్శి 90.54
కొండపి 83.29
పర్చూరు 87.28
గిద్దలూరు 82.22
ఎస్‌.ఎన్‌.పాడు 85.7
కనిగిరి 82.51
ఒంగోలు 82.09
కందుకూరు 89.66
అద్దంకి 90.06

మొరాయించిన ఈవీఎంలు
పోలింగ్‌ మొదలు కావడంతోనే ఈవీఎంలు మొరాయించాయి. జిల్లా వ్యాప్తంగా 154 పోలింగ్‌ కేంద్రాల్లో ఈ సమస్య వచ్చింది. కొన్ని కేంద్రాల్లో వెంటనే ఈవీఎంలను పునరుద్ధరించారు. ఒంగోలు కేంద్రంలోని బండ్లమిట్ట కేంద్రంలో ఈవీఎంలు పని చేయకపోవడంతో వెంటనే వేరొక ఈవీఎంలను తెప్పించారు. వాటిని అనుసంధానం చేసిన తర్వాత పీవో తడబాటుతో తప్పులు చేయడంతో 138 పోలింగ్‌ కేంద్రంలో రెండు గంటల పాటు పోలింగ్‌ నిలిచింది. ఓటర్లలో అసహనం ఎదురై సిబ్బందిపై తిరగబడ్డారు. పోలీసులు కల్పించుకోవడంతో గొడవ సద్దుమణిగింది.

జిల్లా వ్యాప్తంగా మొరాయించిన ఈవీఎంలు
పోలింగ్‌ సందర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన ఈవీఎం యంత్రాలు చాలా చోట్ల మొరాయించాయి. దీంతో రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. ఒంగోలు రామ్‌నగర్‌ రెండోలైన్‌లోని 167 పోలింగ్‌ బూత్‌లో ఉదయం 9 గంటల వరకు ఈవీఎంలు పనిచేయలేదు. ఇక్కడే ఓటు ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి చాలా సేపు ఓటు వేసేందుకు వేచి చూడాల్సి వచ్చింది. ఉదయం 6 గంటల నుంచే క్యూలైన్లో నిలుచున్న ఓటర్లు ఈవీఎంలు పనిచేయక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యర్రగొండపాలెం పోలింగ్‌బూత్‌ నెం 59 నర్సాయపాలెంలో ఉదయం 9.30 గంటల వరకు ఈవీఎంలు పనిచేయలేదు. త్రిపురాంతకం పోలింగ్‌బూత్‌ నెం. 122లోనూ ఇదే పరిస్థితి.

గిద్దలూరు నియోజకవర్గంలో దద్దవాడ పోలింగ్‌ బూత్‌ నం. 251, 252లలో ఉదయం 9.30 గంటల వరకు ఈవీఎంలు పనిచేయలేదు. కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలం గంగపాలెం పోలింగ్‌ బూత్‌ నం.51లో రెండు గంటల పాటు ఈవీఎంలు పనిచేయలేదు. సంతనూతలపాడు నియోజకవర్గంలో పోలింగ్‌ బూత్‌ నెం. 204 ఉప్పలపాడులో ఈవీఎంలు పనిచేయలేదు. ఇవే కాకుండా జిల్లా వ్యాప్తంగా వందకు పైగా పోలింగ్‌ బూత్‌ల్లో ఉదయం రెండు గంటల పాటు ఈవీఎంలు పనిచేయలేదు. మిగిలిన చోట్ల సైతం ఈవీఎంలు తరుచూ ఆగిపోతూ ఓటర్లను ఇబ్బందులకు గురి చేశారు.

క్రమంగా పెరిగిన ఓటింగ్‌ శాతం: 
గత ఎన్నికల్లో 84 శాతం పోలింగ్‌ జరిగింది. ఈ ఎన్నికల్లో  దానికన్నా ఎక్కువగా పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌ ఆలస్యంగా మొదలైనా జిల్లాలో ఓటింగ్‌ నెమ్మదిగా ఊపందుకుంది. మొదటి రెండు గంటల వ్యవధిలో జిల్లా సరాసరి పోలింగ్‌ శాతం 9 గంటలకు 7.96గా నమోదైంది. 11 గంటలకు 22 శాతం, ఒంటి గంటలకు 41.48 శాతం, 3 గంటలకు 56.47 శాతం, 5 గంటలకు 63.36 శాతం నమోదైంది.  6 గంటల వరకు క్యూలో ఉన్న వారు పూర్తిగా ఓటేసేవరకు పోలింగ్‌ కొనసాగింది.

మీడియా కేంద్రం నుంచి పర్యవేక్షణ
ఒంగోలు ప్రకాశం భవన్‌లోని మీడియా కేంద్రం నుంచి జిల్లా ఎన్నికల అధికారి వినయ్‌చంద్, బాపట్ల ఆర్వో ఎస్‌.నాగలక్ష్మి పర్యవేక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 95 ఫిర్యాదులు హెల్ప్‌ లైన్, ఫిర్యాదుల విభాగానికి అందాయి. వీటిలో మొదటి రెండు మూడు గంటల వరకు ఈవీఎంల సమస్య, ఆ తర్వాత పోలింగ్‌ అక్రమాలు, సాయంత్రం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తల దురాగతాలపై ఫిర్యాదులు అందాయి. వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. మర్రిపూడి మండలం శివరాయునిపేటలో టీడీపీ ఏజెంటు వేము రమేష్‌కు పీవో మాల్యాద్రి పోలింగ్‌ సమయంలో సహకరిస్తున్నట్లుగా జిల్లా ఎన్నికల అధికారి మానిటరింగ్‌లో చూశారు. స్వయంగా ఆయనే గుర్తించినందున పీవోపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. వేరొక పీవోకు విధులను కేటాయించారు.

వైఎస్సార్‌ సీపీదే విజయం
మీడియాతో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఈవీఎం రాజకీయాన్ని చేయాలన్న కుట్రతో ఉన్నారని అన్నారు. ప్రజలు సైకిల్‌కు ఓటు వేస్తుంటే టెక్నికల్‌గా ఫ్యాను గుర్తుకు పడ్తున్నాయని చెప్పడం ఆయన అవివేకమని అన్నారు. వైఎస్సార్‌ సీపీకి మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. జిల్లాలోనూ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు మంచి మెజారిటీతో గెలుపు సాధిస్తారని అన్నారు.

ముగిసిన పోలింగ్‌ పర్వం
ఒంగోలు అర్బన్‌: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ గురువారం సజావుగా ముగిసింది.  సాయంత్రం 6గంటలకు క్యూలో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అనుమతించారు.  గత ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 84.25 శాతం పోలింగ్‌ నమోదైంది. 2019 ఎన్నికల్లో గత ఎన్నికలతో పోలిస్తే  ఓటర్లు  దాదాపు ఒకటిన్నర లక్ష మంది పెరిగారు. పోలింగ్‌ ముగిసే సమయానికి క్యూలో ఉన్న ఓటర్లు కొన్నిచోట్ల రాత్రి 11 గంటల తరువాత కూడా ఓటు వేశారు. మొత్తం పోలింగ్‌ ముగిసే సరికి 85.82 శాతం పోలింగ్‌ నమోదైందని జిల్లా అధికారులు వెల్లడించారు.

సరైన శిక్షణ లేకనే..
పోలింగ్‌ సమయంలో అనుసరించాల్సిన అంశాలపై సరైన శిక్షణ లేనందు వల్ల సిబ్బంది తడబడ్డారు. పీవోలు ఓటర్ల సహనాన్ని పరీక్షించారు. ఉదయం ఏడు గంటలకల్లా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చేశారు. అప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. కొన్ని కేంద్రాల్లో మాక్‌ పోలింగ్‌ పూర్తి కాకపోవడంతో ఓటర్లు గంటల కొద్ది నిల్చుండిపోయారు. పోలింగ్‌ సిబ్బందికి సరైన అవగాహన లేక మాక్‌పోలింగ్‌ చేసిన తర్వాత ఈవీఎం ఫార్మెట్‌లను ఒక సారికి బదులు రెండు పర్యాయాలు, ఇలా పలురకాల తప్పులు చేయడం వల్ల తిరిగి సీలు వేసిన ఈవీఎంలకు సీలు తొలగించి మొదటి నుంచి ఈవీఎంను సిద్ధం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలింగ్‌ రెండు నుంచి మూడు గంటల ఆలస్యంగా మొదలైంది 

ఓటు హక్కు ఉపయోగించుకున్న అభ్యర్థులు
ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన సతీమణి బాలినేని శచీదేవి, తనయుడు బాలినేని ప్రణీత్‌రెడ్డిలతో కలిసి లాయరుపేట వద్ద ఉన్న ఎస్‌ఎస్‌ఎన్‌ జూనియర్‌ కాలేజీలో తమ ఓటు వేశారు.  
ఒంగోలు వైఎస్సార్‌ సీపీ పార్లమెంట్‌ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులురెడ్డి తన కుటుంబ సభ్యులతో రాంనగర్‌ రెండో లైనులోని మున్సిపల్‌ హైస్కూలులో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గద్దలగుంట పోలేరమ్మ దేవస్థానం వీధిలోని పోలింగ్‌ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తెలుగుదేశం అభ్యర్ధి శిద్దా రాఘవరావు తన కుటుంబ  సభ్యులతో  ఒంగోలు ఎస్‌ఎస్‌ఎన్‌ జూనియర్‌ కళాశాల పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్ధి దామచర్ల జనార్దన్‌ ఒంగోలు రాంనగర్‌ హైస్కూలులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 
జనసేన పార్లమెంట్‌ అభ్యర్థి బెల్లంకొండ సాయిబాబా కంభం మండలం తురిమెళ్లలో ఓటు వేశారు. ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి రియాజ్‌ ఒంగోలులో ఓటు వేశారు.
కలెక్టర్‌ వినయ్‌చంద్‌ డీఆర్‌ఆర్‌ఎం పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జేసీ ఎస్‌.నాగలక్ష్మి ఈ కేంద్రంలోనే ఓటు వేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement