
సాక్షి, శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన పోలింగ్ (2019 సార్వత్రిక ఎన్నికలకు సబంధించి) తొలుత మందకొడిగా ప్రారంభమైంది. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ నిర్వహించారు. దీంతో ఓటర్లు అక్కడక్కడ కొంత తడపడ్డారు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఉదయం నుంచి సాయింత్రం వరకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారులు పూర్థి స్థాయిలో వసతులు కల్పించలేకపోయారు. ఎండ ఎక్కువగా ఉన్నందున ఓటర్లు ఇబ్బందిపడ్డారు. కొంతమంది ఇళ్లకు వెళ్లి సాయంత్రం వచ్చి ఓటు వేశారు. మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడం, వీవీప్యాట్లు పనిచేయకపోవడం వంటి సమస్యలతో ఓటర్లు విసిగి ఇళ్లకు వెళ్లిపోయారు.
అధికార పార్టీ ఆగడాలు
పలుచోట్లు అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు వివాదాలకు దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని గుర్తించిన చోట ఘర్షణలకు తెరలేపారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సంయమనం పాటించి ఓటింగ్‌కు సహకరించారు.
పలుచోట్ల ఆలస్యంగా ప్రారంభం
ప్రారంభంలో ఓటింగ్ చాలా మందకొడిగా సాగింది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చినా అక్కడ ఓటింగ్ యంత్రాలు ఇబ్బంది పెట్టడంతో చాలామంది ఓటు వేయకుండానే వెనుదిరిగారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. జిల్లాలో సుమారుగా 357 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటు వేయలేని పరిస్థితి నెలకొంది. ఉదయం 9 గంటలకు ఇరత మిషన్లు సమకూర్చడం జరిగినా, అప్పటికే ఎండలు ప్రారంభం కావడంతో ప్రధానంగా వృద్ధులు, మహిళలు ఓటు వేసేందుకు రాలేదు. పది నుంచి మూడు గంటల వరకు తక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ సరళి ఇలా..
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 11 గంటల వరకు కేవలం 19.78 శాతం మాత్రమే నమోదు అయింది. పది గంటల నుంచి పలుచోట్ల ఈవీఎంలు పనిచేయడంతో ఒంటి గంటకు 37.92 శాతానికి చేరింది. మూడు గంటలకు 52.11 శాతానికి చేరింది. నాలుగు గంటలకు 59.18 శాతం 5 గంటలకు 63.77 శాతం పోలింగ్ నమోదు అయింది. సాయంత్రం ఆరు గంటల తర్వాత జిల్లాలో 186 కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. రాత్రి ఎనిమిది గంటల వరకు 45 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు.