10 కి.మీ. నడిచి బడికి వెళ్లేవాడిని | pranab mukherjee remembers his childhood | Sakshi
Sakshi News home page

10 కి.మీ. నడిచి బడికి వెళ్లేవాడిని

Published Sun, Dec 22 2013 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM

10 కి.మీ. నడిచి బడికి వెళ్లేవాడిని

10 కి.మీ. నడిచి బడికి వెళ్లేవాడిని

ప్రథమ పౌరుని చిన్ననాటి జ్ఞాపకాలు
కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకున్నా
ప్రొటోకాల్ పక్కన పెట్టి మీడియాతో ప్రణబ్ ఇష్టాగోష్టి
 
 రాష్ట్రపతి విమానం నుంచి సాక్షి ప్రతినిధి ప్రవీణ్ లెంకల:78 ఏళ్ల వయసున్నా ఇంకా కుర్రాడి ఉత్సాహం. అంతే చురుకుదనం. అలుపు లేని ప్రయాణం. నిరంతర శ్రమ. ఎంత క్లిష్ట సమస్యనైనా నేర్పుగా పరిష్కరించగలిగే మేధ. ఈ లక్షణాలే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాష్ట్రపతిని చేశాయి. ఆయనే మన ప్రథమ పౌరుడు ప్రణబ్‌ముఖర్జీ. సాధారణంగా మీడియాతో ముక్కుసూటిగా, పాయింట్ టు పాయింట్ మాట్లాడే ప్రణబ్.. ప్రొటోకాల్ కట్టుబాట్లను కాసేపు పక్కన పెట్టారు. తన సహజ ధోరణికి భిన్నంగా శుక్రవారం చెన్నై-తిరువనంతపురం-కొచ్చి పర్యటన అనంతరం తిరుగు ప్రయాణంలో విమానంలో విలేకరులతో అరగంటసేపు ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ పలు విషయాలను స్పృశించినప్పుడు చిన్ననాటి సంగతుల ను గుర్తు తెచ్చుకున్నారు. ఆ విశేషాలు ఆయున వూటల్లోనే...
 
 పొలం గట్లే బడిబాటలు: చదువుకునే రోజుల్లో బడికి పది కిలోమీటర్ల దూరం నడిచే వెళ్లేవాళ్లం. రోడ్లు కూడా లేవు. పొలాల గట్ల వెంబడే నడిచేవాళ్లం. కాలేజీ చదువు కోసం సమీప పట్టణంలో డిగ్రీలో చేరా. అక్కడి హాస్టల్‌లో అప్పటికి విద్యుత్ సౌకర్యమే లేదు. కిరోసిన్ దీపాల సాయంతోనే చదువుకునేవాళ్లం. అయినా ఆ కష్టాలు నన్ను అడ్డుకోలేదు. స్కూల్‌లో టీచర్ మాలో స్ఫూర్తి నింపేవారు. ప్రేరణ ఇచ్చేవారు. టీచర్లు మలిచిన తీరుగానే విద్యార్థులు మారుతారు. అప్పుడు వాళ్లు చెప్పిన తులనాత్మక అధ్యయనం నాకు జీవితంలో ఎంతగానో పనికొచ్చింది. విభిన్న దేశాల చరిత్రను, రాజవంశాలను, సంస్కృతిని అర్థం చేసుకోగలిగాం. దేశ విదేశ రాజులు, వారి రాజ్యాలు, పాలన గురించి మొత్తం చెప్పగలిగేవాళ్లం.
 
 ప్రతిభే పలు దారులు చూపుతుంది: చాలా ఏళ్ల నాటి సంగతిది. అవిభాజ్య బీహార్‌లోని ఒక నిరుపేద పిల్లాడు పాట్నా సైన్స్ కాలేజీలో స్కాలర్‌షిప్‌పై ఇంటర్ ఫస్టియర్‌లో చేరాడు. లెక్కల మాస్టారు పాఠం చెబుతుంటే ఈ పిల్లాడు పదేపదే లేవబోతూ, కూర్చుంటూ అసౌకర్యంగా కదులుతున్నాడు. సరిగ్గా పాఠం వినట్లేదనుకున్న మాస్టారు ఏమిటంటూ గద్దించారు. దాంతో ఆ విద్యార్థి లేచి, ‘మీరు చేస్తున్న పద్ధతిలో ఆ లెక్కకు ఎన్నటికీ జవాబు దొరకదు సర్. ఆ పద్ధతి తప్పు’ అంటూ జవాబిచ్చాడు. దాంతో అవాక్కయిన టీచర్ ఆ కుర్రాడిని వచ్చి బోర్డుపై ఆ లెక్కకు పరిష్కారం చూపమన్నాడు. కుర్రాడు ఆ ఒక్క లెక్కకు 18 రకాల పరిష్కారాలు చూపడంతో అబ్బురపడిపోయూడు. ఆ ఏడాది వరల్డ్ మ్యాథమెటిక్స్ కాన్ఫరెన్స్ ఆ కాలేజీలోనే జరగబోతోంది.

 

అమెరికా వంటి దేశాల నుంచి గొప్ప ప్రొఫెసర్లు రాబోతున్నారు. ఆ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ నాగేంద్ర గొప్ప గణిత అధ్యాపకుడు . కుర్రాడికి ఆ సదస్సులో మాట్లాడే అవకాశం కల్పించాలని డాక్టర్ కెల్లీ అనే అమెరికా స్కాలర్‌ను కోరారు. ఆయనేమో తమ వర్సిటీలో నేరుగా ఒక రీసెర్చ్ స్కాలర్‌గానో, ప్రొఫెసర్‌గానో చేర్చుకుంటామన్నారు. కానీ ఆ కుర్రాడు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి అని చెబితే అబ్బురపడ్డారు. వెంటనే తమ వర్సిటీ నిబంధనలను కూడా మార్చేసి మరీ వెంటవెంటే అన్ని పరీక్షలకూ హాజరయ్యేలా అతనికి అవకాశం కల్పించారు. ఆ విద్యార్థే గణిత శాస్త్ర ప్రముఖుడు వశిష్ట నారాయణ్ సింగ్. ఒక సాధారణ కానిస్టేబుల్ కుమారుడైన అతని ప్రతిభను గుర్తించింది,  ప్రేరణ కలిగేలా అవకాశాలు కల్పించింది ఓ మాస్టారే. అలాంటి అధ్యాపకులు అద్భుతాలు సృష్టించగలరు.
 
 నాడు టీచర్ల జీతం రూ. 60: మేం చదువుకునే రోజుల్లో కళాశాల అధ్యాపకులకు రూ.60 జీతం వచ్చేది. 1955లో యూజీసీ వచ్చేదాకా ఉపాధ్యాయులకు సరైన వేతనాలుండేవి కావు. కానీ వారి సేవలు అద్భుతంగా ఉండేవి. అధ్యాపకులు ప్రేరణ కలిగించినప్పుడు, స్ఫూర్తినిచ్చినప్పుడు దేశంలోని ప్రతిభ బయట పడుతుంది. ఒకప్పుడు మన దేశ వర్సిటీలకు ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకునే వారు. ఆ రోజులు మళ్లీ రావాలంటే అలాంటి టీచర్లను మనం గుర్తించగలగాలి. వెలుగులోకి తీసుకురాగలగాలి.. ముఖ్యంగా యూనివర్సిటీల్లో పని చేసే అధ్యాపకులు పరిశోధనల్లో తాము భాగమై, విద్యార్థులనూ భాగస్వాములను చేయాలి.


 శక్తినిచ్చేది గమ్యమే: మన గమ్యమే మనకు శక్తినిస్తుంది. ఎలా ఉండాలనుకుంటున్నామన్న దాన్ని బట్టే మన ప్రయాణం ఉంటుంది. నిరంతరం శ్రమించడం ద్వారానే గమ్యాన్ని చేరుకోగలుగుతాం. ఇలాంటి ప్రయాణంలో అలుపుండదు. గమ్యం తెలియనప్పుడే అలుపొస్తుంది. శక్తిపుట్టదు. ముందుకూ సాగలేం.
 
 ‘నీలం’ శతజయంత్యుత్సవాలకు ప్రణబ్


 సాక్షి, హైదరాబాద్: ఈ నెల 23న అనంతపురంలో జరిగే మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శతజయంతి వేడుకల ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పాల్గొననున్నారు. ఈ మేరకు రాష్ట్రపతిని కలసి వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానించగా.. ఆయన అంగీకరించారని రాష్ట్ర మంత్రి రఘువీరారెడ్డి శనివారం వెల్లడించారు. సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 12 వేల మందితో సంజీవరెడ్డి స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గవర్నర్, ముఖ్యమంత్రి కూడా పాల్గొంటారన్నారు.


 29న మూడు జిల్లాల్లో రాష్ర్టపతి పర్యటన


 రాష్ట్రపతి 29న పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు జిలా ్లల్లో పర్యటించనున్నారు. 29న ఉదయం హైదరాబాద్‌లో బయల్దేరి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు స్వగ్రామమైన ఐ భీమవరం చేరుకుంటారు. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన వేద పాఠశాల, కల్యాణమండపం, షిరిడీ సాయి మందిరాలను ప్రారంభిస్తారు. తర్వాత కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతి చేరుకుంటారు. తిరుచానూరు వద్ద భక్తుల కోసం నిర్మించనున్న వసతి గృహ సముదాయానికి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement