
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి, ఘన స్వాగతం
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఉదయం 11.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు నగరంలోని హకీంపేట విమానాశ్రయానికి విచ్చేశారు. రాష్ట్రపతికి ఈ సందర్భంగా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు.
ప్రతి ఏటా రాష్ట్రపతి హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడి 'రెసిడెన్సీ హౌస్'లో విడిది చేయడం ఆనవాయితీ. ఆయన జూలై 8 వరకు హైదరాబాద్లో బస చేయనున్నారు. కాగా జూలై 1న రాష్ట్రపతి తిరుపతికి వెళ్లనున్నారు. అలాగే 3న హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో జరిగే కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు రచించిన 'ఉనికి' పుస్తకం తొలి ప్రతిని ప్రణబ్ స్వీకరించనున్నారు. జూలై 6న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వద్ద నక్షత్ర వాటికను ఆయన ప్రారంభిస్తారు.