ఉన్మాదం | Pregnant, the maniac who killed her daughter | Sakshi
Sakshi News home page

ఉన్మాదం

Published Sat, Jul 19 2014 2:55 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

ఉన్మాదం - Sakshi

ఉన్మాదం

  • గర్భిణీ, ఆమె కుమార్తెను చంపిన ఉన్మాది
  •   ఆపై ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య
  •   ఉలిక్కిపడిన గూడూరు
  • గూడూరు/మచిలీపట్నం : ఉన్మాది పేట్రేగి పోయాడు. గర్భిణి, ఆమె ఏడాదిన్నర వయసు గల కుమార్తెను బలితీసుకున్నాడు. కొద్దిరోజుల్లో ఈ లోకంలోకి రావాల్సిన పసిగుడ్డును తల్లికడుపులోనే అంతంచేశాడు. చివరికి తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గూడూరులో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ దుర్ఘటన జరిగింది.

    ఒకే గదిలో ముగ్గురి మృతదేహాలను చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గూడూరు గ్రామానికి చెందిన ఏలూరు వెంకన్న (28) లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. అతను అదే గ్రామంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సంపతి కుమారి(24)తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. కుమారి భర్త శ్రీనివాసరావు టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అతను ఐదు రోజుల క్రితమే విజయవాడ వెళ్లాడు. అప్పటి నుంచి కుమారి ఇంట్లోనే వెంకన్న ఉంటున్నాడు.

    కొద్దికాలంగా కుమారి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వెంకన్న ఆమెతో వాగ్వాదానికి దిగాడు. గది తలుపునకు గొళ్లెం పెట్టిన వెంకన్న తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న కత్తితో ఎనిమిది నెలల గర్భిణీ అయిన కుమారి, ఆమె కుమార్తె దుర్గాభవానీ (18నెలలు) పీకలు కోసి చంపేశాడు. అనంతరం అతను అదే గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
     
    సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నం!
     
    కుమారి, అమె కుమార్తెలను హత్య చేసిన అనంతరం వెంకన్న తన చేతులకు అంటిన రక్తాన్ని శుభ్రం చేసుకున్నట్లు, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ఇంట్లో మరకలను కడిగేందుకు నీళ్లు పోసినట్లు ఘటనాస్థలాన్ని పరిశీలిస్తే స్పష్టమవుతోంది. కుమారి, ఆమె కుమార్తె నుంచి రక్తం అధికంగా కారటంతో ఆ ప్రయత్నం విరమించుకున్నట్లు అర్థమవుతోంది. ఈ విషయం బయటకు పొక్కుతుందనే భయంతో చివరకు వెంకన్న కూడా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
     
    వెలుగుచూసిందిలా...
     
    టాక్సీ డ్రైవర్ అయిన కుమారి భర్త శ్రీనివాసరావు ఐదు రోజులుగా విజయవాడలోనే ఉంటున్నాడు. గురువారం రాత్రి తొమ్మిది గంటలకు కుమారి సమీపంలోని తన తల్లి సుభద్ర ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి తన కుమార్తె దుర్గాభవానీ కోసం పాలు తెచ్చుకుంది. ఇంటికి వెళ్లిన అనంతరం తాను భోజనం చేశానని, దుర్గాభవానీ నిద్రిస్తోందని, మీరు పడుకోండని తల్లికి ఫోన్ చేసి చెప్పింది. తోడుగా తాను ఇంటికి వస్తానని తల్లి చెప్పినా కుమారి వద్దని వారించింది.

    అప్పటికే కుమారితోపాటు వెంకన్న ఇంట్లోనే ఉన్నాడు. శుక్రవారం ఉదయం కుమారి కుమార్తెకు టిఫిన్ ఇచ్చిరావాలని సుభద్ర తన సోదరి కుమార్తె దేవిని పంపారు. కుమారి నివసిస్తున్న ఇంటికి వచ్చిన దేవి తలుపులు కొట్టగా ఎవరూ మాట్లాడలేదు. కిటికీలో నుంచి చూడగా కుమారి, ఆమె కుమార్తె దుర్గాభవానీ రక్తపు మడుగులో మృతిచెంది ఉన్నారు. వెంకన్న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతున్నాడు. స్థానికులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి పరిశీలించారు.
     
    పోలీసుల విచారణలోఆసక్తికర విషయాలు..
     
    గూడూరు ఇందిర మ్మకాలనీలోని ఘటనాస్థలాన్ని బందరు డీఎస్పీ కేవీ శ్రీనివాసరావు శుక్రవారం పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఐదు రోజులుగా వెంకన్న కుమారితో పాటు ఇంట్లోనే ఉంటున్నాడని స్థానికులు తెలిపారు. కుమారి హత్యకు గురైందనే తెలిసి గూడూరు వచ్చిన ఆమె భర్త శ్రీనివాసరావు, తల్లి సుభద్ర, స్థానికుల నుంచి మరిన్ని వివరాలు సేకరించారు.

    కుమారికి వెంకన్నతోపాటు మరి కొందరితోనూ వివాహేతర సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వెంకన్న తన సెల్‌ఫోన్ నుంచి కుమారితో వివాహేతర సంబంధం ఉన్న వారికి ఫోన్ చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని వెంకన్న తండ్రి పోలీసుల వద్ద ప్రస్తావిం చాడు. వెంకన్న పదేపదే వేరే వ్యక్తులకు ఫోన్ చేయటం, ఈ విషయం నచ్చని కుమారి అతనితో గొడవకు దిగడం వల్లే హత్యలు చేసి ఉంటాడనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

    రూరల్ సీఐ ఎస్‌వీఎస్ మూర్తి, గూడూరు ఎస్‌ఐ అడపా ఫణిమోహన్, పెడన ఎస్‌ఐలు దుర్గాప్రసాద్, మణికుమార్ ఘటనాస్థలానికి వచ్చారు. వెంకన్న ఒక్కడే ఈ ఘతుకానికి పాల్పడ్డాడా.. లేక మరెవరైనా పాలుపంచుకున్నారా.. అనే విషయంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తంచేయగా.. పోలీసులు ఆ దిశగా కూడా విచారణ చేస్తున్నారు. క్లూస్‌టీమ్ సిబ్బంది ఘటనాస్థలంలో వివరాలు సేకరించారు. కుమారి సోదరుడు సురేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement