
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి ఉధృతమైతే ఎదుర్కొనేలా ముందస్తు వ్యూహంతో సర్కారు మరో ముందడుగు వేసింది. ప్రతి బోధనాసుపత్రిలో కొన్ని ప్రత్యేక పడకలు, ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేయడం కంటే ప్రత్యేకంగా 4 మెడికల్ కళాశాలల పరిధిలోని ఆసుపత్రులను కేవలం కరోనా వైరస్ సోకిన వారికి మాత్రమే చికిత్స అందించేలా వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాల (ఇక్కడ వైరాలజీ ల్యాబ్ కూడా ఉంది), నెల్లూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల, విశాఖపట్నంలోని విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్), తిరుపతిలోని ఎస్వీఎంసీ (రుయా)లను పూర్తిగా కరోనా వైద్యానికే కేటాయించాలని నిర్ణయించింది. కరోనా కేసులకు మాత్రమే ఈ ఆసుపత్రులను వినియోగిస్తే సాధారణ రోగులకు ఈ వైరస్ సోకదని భావిస్తోంది.
సాధారణ రోగులకు ప్రత్యామ్నాయాలు
- సిద్ధార్థ వైద్య కళాశాలకు వచ్చే రోగులు గుంటూరులోని సర్వజనాసుపత్రికి వెళ్లాలి.
- నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు వచ్చే వారు నారాయణ మెడికల్ కాలేజీకి వెళ్లాలి.
- విశాఖ విమ్స్‌కు వెళ్లే రోగులందరూ కింగ్ జార్జి ఆస్పత్రికి వెళ్లాలి.
- తిరుపతిలోని రుయాకు వచ్చే రోగులు ఇకపై పద్మావతి మెడికల్ కాలేజీ పరిధిలోని స్విమ్స్‌కు వెళ్లాలి.
- ఈ నాలుగు కాలేజీల్లో కరోనా వైద్యానికి 4 వేలకు పైగా పడకలు గురువారం నాటికి అందుబాటులోకి రానున్నాయి.
- కరోనా చికిత్సకు ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ఇతరత్రా ఔట్ పేషెంట్, ఇన్‌పేషెంట్, అత్యవసర సేవల నిలిపివేత.
24 గంటలు అందుబాటులో వైద్యులు
కరోనాపై ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధమయ్యాం. వైద్యులు పూర్తి స్థాయిలో 24 గంటలు అందుబాటులో ఉంటారు. కరోనా పాజిటివ్‌గా గుర్తించిన వారికి మెరుగైన వైద్యం అందించి కోలుకోవడమే లక్ష్యంగా కృషి చేస్తాం.
– డాక్టర్ పోతురాజు నాంచారయ్య, సూపరింటెండెంట్, విజయవాడ ప్రభుత్వాస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment