రాష్ట్రపతి పర్యటనను జయప్రదం చేయాలి | President Pranab Mukherjee tour in Bhimavaram on 29th december | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి పర్యటనను జయప్రదం చేయాలి

Published Mon, Dec 23 2013 3:27 AM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM

President Pranab Mukherjee tour in Bhimavaram on 29th december

 అయిభీమవరం (ఆకివీడు), న్యూస్‌లైన్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈనెల 29న ఆకివీడు మండలం అయి భీమవరం రానున్నారని.. ఆయన పర్యటనను జయప్రదం చేసేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సిద్ధార్థజైన్, టీటీడీ చైర్మన్, ఎంపీ కనుమూరి బాపిరాజు అన్నారు. అయిభీమవరంలోని వేంకటేశ్వరస్వామి కల్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం జిల్లాస్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 
 
 రాష్ట్రపతి రాక అరుదైన విషయమని, కార్యక్రమంలో ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలన్నారు. రాష్ట్రపతి వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకూ ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సమయం తక్కువుగా ఉన్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేయాలన్నారు. ఎంపీ బాపిరాజు మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటన మూడు నెలల ముందుగానే ఖరారవుతుందనీ.. అయితే తనపై నమ్మకంతో ప్రణబ్ ముఖర్జీ తక్కువ సమయంలోనే పర్యటనకు అంగీకరించడం గొప్ప విషయమని చెప్పారు. టీటీడీ జేఈవో భాస్కర్ మాట్లాడుతూ అడుగంటిపోతున్న వేద విద్యను ప్రోత్సహించడానికే రాష్ట్రపతి ఈ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నారన్నారు. 
 
 హెలీప్యాడ్ స్థల పరిశీలన
 రాష్ట్రపతి రాక కోసం ఆకివీడులో సిద్ధం చేస్తున్న హెలీప్యాడ్ నిర్మాణ ప్రాంతాన్ని కలెక్టర్, ఎంపీ పరిశీలించారు. రాష్ట్ర రహదారికి, అయిభీమవరానికి దగ్గరకు ఉం డటంతో ఈ స్థలాన్ని ఎంపికచేశామని వారు తెలిపారు. హెలీప్యాడ్ ప్రాంతం నుంచి వేద పాఠశాల భవనానికి రాష్ట్రపతి ప్రయాణించాల్సిన దూరం, సమయాలను కలెక్టర్ కారులో ప్రయాణించి పరిశీలించారు. రక్షణ దళ అధికారులు, రాష్ట్రపతి ప్రత్యేక రక్షణ సిబ్బంది వచ్చి రాష్ట్రపతి కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలిస్తారని.. అనంతరమే పర్యటనపై కచ్చితమైన నిర్ణయానికి రాగలమని కలెక్టర్ తెలిపారు. జేసీ బాబూరావునాయుడు, డ్వామా పీడీ రామచంద్రారెడ్డి, ఆర్డీవో వసంతరావు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. 
 
 రాష్ట్రపతి 29వ తేదీ ఉదయం 11.50 గంటలకు అయిభీమవరంలో వేదపాఠశాల నూతన భవన ప్రాంగణానికి  చేరుకుంటారు. పూర్ణకుంభంతో పండితులు ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం రాష్ట్రపతి ధ్యానమందిరంలో చతుర్వేద పారాయణలో పాల్గొంటారు. వేదపాఠశాల నూతన భవన ప్రారంభం, పైలాన్ ఆవిష్కరణ, భవనంలోని వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట, హారతి, పాఠశాలకు ఉత్తర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద వేదవిద్యార్థులు, ఉపాధ్యాయుల ఇష్టాగోష్టి కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. సమీక్ష సమావేశంలో ఎస్పీ హరికృష్ణ, జేసీ బాబూరావునాయుడు, టీటీడీ ఎస్‌ఈ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement