మీ రాక కోసం
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నేడు రాక
ఐ.భీమవరంలో వేద పాఠశాల భవన ప్రారంభోత్సవం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం జిల్లాకు రానున్నారు. దేశ ప్రథమ పౌరుడు జిల్లాలోని మారుమూల పల్లెకు విచ్చేసి ప్రతి ష్టాత్మక వేద పాఠశాలను ప్రారంభించి విద్యార్థులతో ముచ్చటించే అపురూప ఘట్టానికి సన్నాహాలు పూర్తయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ఆకివీడు మండలం ఐ.భీమవరంలో నిర్మించిన వేద పాఠశాల ప్రారంభోత్సవానికి అధికారులు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రపతి పర్యటన పలుమార్లు వాయిదా పడగా, ఈసారి ఆయన పర్యటన కచ్చితంగా ఉంటుందని అధికారులకు స్పష్టమైన సమాచారం వచ్చింది. దీంతో కొద్దిరోజులుగా ఏర్పాట్లలో తలమునకలయ్యారు. రాష్ర్టపతి భద్రతకు సంబంధించి, పర్యటనలో చిన్నపాటి అపశృతి కూడా దొర్లకుండా ఉండేందుకు పక్కాగా ఏర్పాట్లు చేశారు. వేలాదిమంది పోలీసులు, రక్షణ విభాగాలకు చెందిన సిబ్బంది మోహరించారు. రాష్ట్రపతి వచ్చే హెలికాప్టర్‌తోపాటు భద్రతకు సంబంధించి మరో రెండు హెలికాప్టర్లు దిగేందుకు వీలుగా ప్రత్యేక హెలిప్యాడ్‌లు నిర్మిం చారు. ఆకివీడు నుంచి అయి భీమవరం వరకు ఆర్ అండ్ బీ రహదారి నిర్మాణం పూర్తి చేశారు.
ప్రణబ్ పర్యటన ఇలా
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ర్టపతి నిలయం నుంచి బయలుదేరి హకింపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు ప్రత్యేక విమానంలో వస్తారు. అక్కడ ఉదయం 11.05 నిమిషాలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 11.25 గంటలకు ఐ.భీమవరం చేరుకుంటారు. అక్కడి నుంచి వేద పాఠశాలకు వస్తారు. 11.45 గంటల నుంచి మధ్యాహ్నం 1.05 గంటల వరకు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుపతి వెళతారు.
సీఎం, కేంద్ర మంత్రుల రాక
రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు పి.అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి, రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు శుక్రవారం ఐ.భీమవరం విచ్చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఉదయం 11గంటలకు హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకుని అక్కడ విమానాశ్రయంలో రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు.
‘పశ్చిమ’కు వస్తున్న మూడో రాష్ర్టపతి
గతంలో రాష్ట్రపతి హోదాలో జ్ఞానీ జైల్‌సింగ్, అబ్దుల్ కలాం జిల్లాకు విచ్చేశారు. ఇరవై ఏళ్ల కిందట జ్ఞానీజైల్‌సింగ్ పశ్చిమ పర్యటనకు రాగా, అబ్దుల్ కలామ్ భీమవరం ప్రాంతంలో రాష్ట్రపతి హోదాలో ఒకసారి పర్యటించారు. ప్రణబ్ ముఖర్జీ రాకతో జిల్లాలో ముగ్గురు రాష్ట్రపతులు పర్యటించిన ఘనత నమోదు కానుంది.