జూన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాక
- హైదరాబాద్‌లోని బొల్లారంలో విడిది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్‌లో వేసవి విడిది చేయనున్నారు. జూన్ చివరి వారంలో ఆయన పర్యటన ఉంటుందని రాష్ట్రపతి భవన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. వారం నుంచి పది రోజుల పాటు ఆయన సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్రపతి భవన్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 24 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో శీతాకాల విడిదికి రావాల్సి ఉండగా... అనివార్య కారణాలతో ఆ పర్యటన రద్దయింది.
గుండె సంబంధిత ఇబ్బందులతో ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న నేపథ్యంలో విశ్రాంతి తీసుకునేందుకు రాష్ట్రపతి ఆ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రపతి నిలయంలో విడిదికి వచ్చిన సమయంలో ఇక్కడి నుంచే ఆయన దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరై తిరిగి హైదరాబాద్ వస్తుంటారు.
దీంతోపాటు రాజకీయ ప్రముఖులు, సామాజిక సంఘాలు, ఎన్‌జీవోలు, ప్రజలను కలిసేందుకు ఆయన కొంతసమయం వెచ్చిస్తారు. ఇటీవలే రాష్ట్రపతి భవన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఒక బృందం విడిది ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిసింది. మే నెలాఖరున రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశముంది.