
శ్రీవారి ఆలయం వెలుపల రాష్ట్రపతి కోవింద్ దంపతులు, గవర్నర్ దంపతులు, ఎంపీ విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి తదితరులు
తిరుమల: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సతీమణి సవితా కోవింద్, కుమార్తె స్వాతి, కుటుంబ సభ్యులతో కలసి విశ్రాంతి భవనం నుంచి కోవింద్ ఉదయం 6 గంటలకు ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం శ్రీవారి పుష్కరిణిని దర్శించారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం భూ వరాహస్వామివారిని దర్శించుకున్న అనంతరం మహద్వారం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి, అర్చకులతో కలసి రాష్ట్రపతికి ఇస్తికఫాల్ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి ఆలయంలోకి ప్రవేశించిన రాష్ట్రపతి తొలుత ధ్వజస్తంభానికి నమస్కరించారు.
అనంతరం సన్నిధిలో పచ్చ కర్పూరపు వెలుగులో శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్య మంగళరూపాన్ని దర్శించుకున్నారు. స్వామివారి పాదాల వద్ద ఉంచిన పట్టుశేషవస్త్రాన్ని ఆలయ ప్రధాన అర్చకులు రాష్ట్రపతికి బహూకరించారు. తర్వాత వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు రాష్ట్రపతికి ఆశీర్వాదం చేయగా, టీటీడీ చైర్మన్, ఈవో, ప్రత్యేకాధికారి.. శ్రీవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు ఆయనకు అందజేశారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ నరసింహన్ దంపతులు కూడా శ్రీవారిని దర్శించుకుని, ప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్రపతితో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, టీటీడీ సీవీఎస్‌ఓ గోపీనాథ్‌జెట్టి ఉన్నారు.