అది రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనే
సాక్షిని అనుమతించకపోవడం పట్ల ప్రెస్ కౌన్సిల్ సీరియస్
ఏపీ సీఎం విలేకరుల సమావేశాలకు సాక్షి, నమస్తే తెలంగాణకినిరాకరణ
{పెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసిన పాత్రికేయ సంఘాలు
విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు కన్వీనర్‌గా రాజీవ్ రంజన్ నాగ్
సభ్యులుగా కె.అమర్‌నాథ్,{పజ్ఞానంద్ చౌధురి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారికంగా నిర్వహించిన విలేకరుల సమావేశాలకు సాక్షి, నమస్తే తెలంగాణ పత్రికలు, సాక్షి న్యూస్ చానల్, టీ న్యూస్ చానల్ విలేకరులను అనుమతించకపోవడాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) తీవ్రంగా పరిగణించింది. విలేకరులకు అనుమతి నిరాకరించడం రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘనగా పేర్కొంది. ఈ అంశాన్ని విచారించి నివేదిక ఇవ్వడానికి వీలుగా ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తూ శుక్రవారం ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ప్రెస్ కౌన్సిల్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. రాజీవ్ రంజన్ నాగ్ కన్వీనర్‌గాను ఈ కమిటీలో కె.అమర్‌నాథ్, ప్రజ్ఞానంద్ చౌధురి సభ్యులుగా నియమితులయ్యారు. కమిటీ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో.. ‘‘ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధికారికంగా నిర్వహించే విలేకరుల సమావేశాలకు సాక్షి, నమస్తే తెలంగాణ పత్రికల అక్రిడిటెడ్ రిపోర్టర్ల అనుమతిని నిరాకరిస్తున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది.
ఈ రెండు పత్రికలు, చానెళ్ల ప్రతినిధులకు అనుమతి నిరాకరిస్తున్న విషయాన్ని నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) ఈనెల 20న, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) 22న వినతిపత్రాలు సమర్పించాయి. విలేకరులను ప్రెస్ కాన్ఫరెన్సులు కవర్ చేయకుండా నియంత్రించడంవల్ల మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించినట్లేనని ప్రెస్ కౌన్సిల్ చైర్మన్‌గా నేను భావిస్తున్నాను. రెండు పత్రికలు, టీవీ చానళ్ల పట్ల ఏపీ ప్రభుత్వం వివక్ష చూపడం ద్వారా రాజ్యాంగంలోని అధికరణ 19 (1)(ఎ) ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రానికి భంగం కలిగించింది. మీడియాకు సమాచారాన్ని నిరాకరించడం ద్వారా ప్రజలకు సమాచారం తెలుసుకొనే హక్కునూ హరించింది. ఇవి హక్కుల ఉల్లంఘనలే. ఈ అంశంపై విచారించి వీలయినంత త్వరగా నాకు నివేదిక ఇవ్వడానికి వీలుగా రాజీవ్ రంజన్ నాగ్ (కన్వీనర్), కె.అమర్‌నాథ్(సభ్యుడు), ప్రజ్ఞానంద్ చౌధురి(సభ్యుడు)తో కమిటీ ఏర్పాటు చేస్తున్నాను. విచారణ చేపట్టడానికి సొంత విధానాన్ని కమిటీ రూపొందించుకోవాలి. విలేకరులను అనుమతించే విషయంలో ఉన్న నిషేధం/ఇబ్బందులు/అవరోధాలను తొలగించడానికి తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేయాలి. ఇందుకు సంబంధించిన వారిని, అధికార వర్గాలతో కమిటీ సమావేశం కావాలి. అవసరమైన సహాయ సహకారాలను అధికార వర్గాలు అందించాలి. కమిటీ విషయంలో ఎవరూ, జోక్యం చేసుకోకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలి’’ అని కట్జూ పేర్కొన్నారు.