పిట్టలవానిపాలెం : ఆరుగాలం కష్టం చేసి పండించినా గిట్టుబాటు ధర లేదని రైతులు ధాన్యాన్ని కల్లాలు, ఇళ్లల్లో నిల్వ ఉంచుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలోనే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న రైతులకు ఇప్పుడు ధర రూపంలో కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. పంటను అమ్ముకోలేక, నిల్వ ఉంచలేక అవస్థలు పడుతున్నారు. వర్షాభావం కారణంగా ఆదిలోనేనాట్లు కొంత ఆలస్యమయ్యాయి. పంట బాగుంటుందనుకున్న సమయంలో తెగుళ్లు దాడి చేశాయి. పంట పండి ధాన్యం ఇంటికి చేరిన ప్రస్తుత తరుణంలో ధరలు చూస్తే రైతుల కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కనీసం కాంప్లెక్స్ ఎరువు బస్తా ధర కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.
దళారుల చేతిలో ధర ...
ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ సొమ్మొకరిది సోకొకరిది అనే చందంగా ధాన్యానికి వ్యాపారులు, దళారులు ధరలు నిర్ణయిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ధరలు లేకుండా పోయాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ప్రారంభంలో ధాన్యం రూ.1500 నుంచి రూ.1600 వరకు ధర పలికింది. ఈ ఏడాది ప్రార ంభం నుంచే మిల్లర్లు, దళారులు రంగప్రవేశం చేసి ధర లేకుండా చేశారని ఆవేదన చెందుతున్నారు. ఎన్‌ఎల్‌ఆర్ రకం ధాన్యం బస్తా రూ.1050. బీపీటీ రూ.1300 వంతున కొనుగోలు చేస్తున్నారు. ఇది ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు.
ఎకరా వరి సాగుకు రైతులు పెట్టుబడుల రూపంలో రూ. 20 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చు చేశారు. దిగుబడి 30 నుంచి 35 బస్తాల వరకు వచ్చింది. ఇప్పుడున్న ధరలకు విక్రయిస్తే ఖర్చు లు పోను రూ.7 నుండి రూ.8 వేలు మాత్రమే మిగులుతాయని కొందరు రైతులు చెబుతున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని వాపోతున్నారు. మిగిలేది లేకపోగా నష్టాలను చవిచూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలతో ఇక్కట్లు....
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో 17 కంటే ఎక్కువ తేమశాతం ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. ధాన్యం ఆరబెట్టుకుని తీసుకెళ్లినా కొనుగోలుకు పలు రకాల ధ్రువపత్రాలు కావాలని అడుగుతున్నారు. కల్లంలో ధాన్యం తూకం వేయించి కొనుగోలు కేంద్రం వద్దకు చేర్చడం, విక్రయించిన ధాన్యానికి చెక్కు తీసుకోవడం, ఆ చెక్కును రైతు తన ఖాతాలో వేసుకుని మార్చుకోవడం వంటి నిబంధనల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తీరా ధాన్యాన్ని తీసుకెళ్లినా తేమశాతం పేరుతో ధర తగ్గించి అడుగుతున్నారని ఆవేదన చెందుతున్నారు.
ధర లేక దైన్యం
Published Wed, Feb 25 2015 3:05 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM
Advertisement