‘ఎర్ర’ బంగారమే...  | Increasing Of Mirchi Crop Price | Sakshi
Sakshi News home page

‘ఎర్ర’ బంగారమే... 

Published Sat, Jun 22 2019 11:16 AM | Last Updated on Sat, Jun 22 2019 11:16 AM

Increasing Of Mirchi Crop Price - Sakshi

మార్కెట్‌ యార్డులో రైతుల కోలాహలం

సాక్షి, ఖమ్మం:  వర్షాభావ పరిస్థితులు.. చీడపీడలు.. గణనీయంగా పెరిగిన పెట్టుబడులు.. ఈ క్రమంలో ఎలాగోలా చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే మార్కెట్‌లో ధర లేని పరిస్థితి. కష్టమైనా.. నష్టమైనా భరిద్దామనే ఉద్దేశంతో పంటను కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేశారు. ఇప్పుడు ఖరీఫ్‌ పంట పెట్టుబడికి నగదు అవసరం ఉండడంతో ఆ పంటను మార్కెట్‌లో అమ్ముతుండగా.. వారం రోజులుగా మిచ్చి పంటకు మంచి ధర పలుకుతోంది. మధిర వ్యవసాయ మార్కెట్‌లో ప్రస్తుత సీజన్‌లో క్వింటాకు రూ.10,500లతో ప్రారంభమైన ధర శుక్రవారం నాటికి రూ.11,700 చేరింది. గత ఖరీఫ్‌లో రైతులు తక్కువ విస్తీర్ణంలో మిర్చి సాగు చేయగా.. ఇప్పుడు ధర మాత్రం బాగానే పలుకుతోంది. దీంతో రైతులు కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసిన పంటను అమ్మేందుకు ఉత్సాహం చూపుతున్నారు.  

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 36 కోల్డ్‌ స్టోరేజీలు ఉన్నాయి. వీటిలో 25 లక్షల బస్తాల మిర్చి నిల్వ చేసుకునే అవకాశం ఉంది. గత ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు, చీడపీడలు, వైరస్‌ ;పట్టడంతో ఆశించిన మేర మిర్చి పంట దిగుబడి రాలేదు. పంట చేతికొచ్చే సమయంలో పెట్టుబడులు, చేసిన అప్పులు తీర్చేందుకు కొందరు రైతులు మొదటి విడత కోసిన మిర్చిని కల్లాల్లోనే అమ్మగా.. మరికొందరు రైతులు తేజరకం క్వింటా మిర్చి రూ.8వేల నుంచి రూ.8,500, లావు రకం రూ.7వేల నుంచి రూ.7,500లకు అమ్మారు. ఇంకొందరు రైతులు ఆ రేటుకు మిర్చి అమ్మితే నష్టపోతామని భావించి కోల్ట్‌ స్టోరేజీల్లో నిల్వ చేశారు. జిల్లావ్యాప్తంగా సుమారు 20 లక్షల బస్తాల మిర్చిని కోల్డ్‌ స్టోరేజీల్లో ఉంచారు. ప్రస్తుతం విదేశాలకు ఎగుమతి చేస్తుండడంతో డిమాండ్‌ పెరిగి.. మంచి ధర కూడా పలుకుతోంది.

ఇప్పటికే రైతులు 10 లక్షల బస్తాలను విక్రయించగా.. మరో 10 లక్షల బస్తాలు కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉన్నాయి. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌లో పంటలకు పెట్టుబడులు పెట్టేందుకు, గత ఏడాది చేసిన అప్పులు తీర్చేందుకు రైతులు మిర్చి పంటను విక్రయించేందుకు సన్నద్ధమయ్యారు. దీనికితోడు గిట్టుబాట ధర కూడా ఉండడంతో పంటను విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం రైతుల పంట ఉత్పత్తుల రాకతో మార్కెట్‌ యార్డు కళకళలాడుతోంది. ముఖ్యంగా తొడిమ తీసిన మిర్చిని 10 కేజీలు, 25 కేజీల ప్యాకింగ్‌తో చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక తదితర దేశాలకు ఎగుమతి చేసేందుకు ఆర్డర్లు ఉన్నాయి. మిర్చి పంటకు ఆశాజనకమైన రేటు ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement