సాక్షి, కొత్తగూడెం(ఖమ్మం) : 2019 – 20 ఆర్థిక సంవత్సర జిల్లా రుణ ప్రణాళిక ఖరారైంది. జిల్లా లీడ్‌బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాలకు సంబంధించి మొత్తం రూ.3,975.85 కోట్ల రుణాలు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధమైంది. ఇందులో ప్రస్తుత ఖరీఫ్, రానున్న రబీ సీజన్‌కు సంబంధించి పంట రుణాలు రూ.1,999.42 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. వీటిలో రూ.252.24 కోట్ల రుణాలు రెన్యువల్ చేసినవి ఉన్నాయి. వచ్చే ఆగస్టు నుంచి కొత్త పాసుపుస్తకాలకు కూడా పంట రుణాలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 888 గ్రామాల్లో మొత్తం 1,19,115 మంది రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్నారు.
వీటిలో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది జిల్లాలో మొత్తం 3,11,627.5 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగుచేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి రూ.1,999.42 కోట్లు రుణాలు ఇవ్వనుండగా, వ్యవసాయ టర్మ్ లోన్లు రూ.185.85 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం ప్రణాళికలో ఇది 4.67 శాతం. వీటితో పాటు వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.899.91 కోట్ల మేర రుణాలు ఇవ్వనున్నారు. మొత్తంగా వ్యవసాయ రంగానికి రూ.3,085.18 కోట్లు ఇచ్చేలా ప్రణాళికలో పొందుపరిచారు.
ఇవన్నీ కలిపి మొత్తం రుణాల్లో రూ.77.59 శాతంగా ఉన్నాయి. మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కు సంబంధించి రూ.63.51 కోట్లు, స్మాల్ ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.95.26 కోట్లు, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.158.77 కోట్లు కేటాయించారు. ఇవి కాకుండా విద్యాశాఖకు రూ.153 కోట్లు, గృహరుణాలకు రూ.363.82 కోట్లు, రెన్యువబుల్ ఎనర్జీకి 18.27 కోట్లు, సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు 13.03 కోట్లు ఇచ్చేలా ప్రణాళిక తయారు చేశారు.
గత వార్షిక ప్రణాళికలో ఇచ్చింది 55.65 శాతమే...
2018–19 సీజన్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా మొత్తం నిర్ధేశించుకున్న వార్షి్క రుణ ప్రణాళిక లక్ష్యంలో 55.65 శాతం మాత్రమే సాధించడం గమనార్హం. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా రూ.3,656.43 కోట్లు వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం కాగా, అందులో ఇచ్చింది రూ.1,999.06 కోట్లు మాత్రమే. వీటిలో ఖరీఫ్, రబీకి కలిపి పంట రుణాల లక్ష్యం రూ.1,852.53 కోట్లు కాగా, ఇందులో రూ.922.15 కోట్లు మాత్రమే ఇచ్చారు. నిర్ధేశిత లక్ష్యంలో 49.77 శాతం మాత్రమే జిల్లాలోని అన్ని బ్యాంకులు కలిపి ఇచ్చాయి. ఇక గత సీజన్‌లో ప్రభుత్వ రంగం బ్యాంకులు మాత్రమే కొంతమేరకు నయం అనిపించాయి.
పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల లక్ష్యం రూ.1,922.37 కోట్లు కాగా, ఇందులో రూ.1,213.80 కోట్లు రుణాలు ఇచ్చాయి. నిర్ధేశిత లక్ష్యంలో ప్రభుత్వరంగ బ్యాంకులు 63.14 శాతం సాధించాయి. వీటిలో ఒక్క ఎస్‌బీఐ మాత్రం 71.08 శాతం ఇచ్చింది. ప్రైవేటు రంగ బ్యాంకులు కేవలం 27.07 శాతం లక్ష్యాన్ని మాత్రమే సాధించాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం వాణిజ్య బ్యాంకులన్నీ (పబ్లిక్, ప్రైవేట్) కలిసి 59.16 శాతం లక్ష్యాన్ని సాధించాయి. ఏపీజీవీబీ, డీసీసీబీ, భద్రాద్రి కో ఆపరేటివ్ బ్యాంకులన్నీ కలిసి 48.18 శాతం లక్ష్యాన్ని సాధించాయి.
గత ఏడాది 60 శాతం మంది రైతులకే పట్టాదారు పాసుపుస్తకాలు
2018 – 19 సీజన్‌లో వివిధ రకాల కారణాలతో నిర్ధేశించుకున్న పంట రుణాల లక్ష్యాన్ని సాధించలేదు. గత ఏడాది 60 శాతం మంది రైతులకే పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నాయి. అదేవిధంగా రుణమాఫీ ఆశ ఉండడంతో, ఈ రుణాలు వస్తే రుణమాఫీ వర్తించదనే అపోహతో రైతులు రుణాలు క్లియర్ చేయలేదు. ఇక చాలామంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు రాలేదు. కలెక్టర్ ఆదేశాల మేరకు మ్యాన్యువల్ పట్టాలకు రుణాలు ఇవ్వలేదు. వచ్చే ఆగస్టు నుంచి కొత్త పాసుపుస్తకాలకు రుణాలు అందుతాయి.
– పుల్లారావు, లీడ్ బ్యాంక్ మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment