తడిసి మోపెడవుతున్న పెట్టుబడి ఖర్చులు.. ప్రకృతి విపత్తులు, చీడపీడల కారణంగా పడిపోతున్న దిగుబడులు, గిట్టుబాటు కాని ధరల నేపథ్యంలో కష్టజీవుల బతుకు దుర్బరంగా మారింది. మట్టినే నమ్ముకుని.. అందులోనే పెట్టుబడులు పెట్టి నాలుగు మెతుకుల కోసం ఆశించే అన్నదాత నష్టాలు మూటగట్టుకుని అప్పుల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాడు.
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: తెగుళ్లు, అకాల వర్షాల కారణంగా అరకొర దిగుబడులతో సరిపెట్టుకున్న రైతులు వాటికి గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. విత్తు సమయంలో ఉన్న ధరకు.. పండిన తర్వాత ఉన్న ధరకు భారీ వ్యత్యాసం ఉండడంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా దక్కని పరిస్థితి నెలకొంది. ఆశించిన రీతిలో దిగుబడులు రాకపోవడం, ధరలు కూడా పడిపోవడంతో
రైతు పరిస్థితి దయనీయంగా మారింది.
ఇవి తగ్గవు.. ఇవి పెరగవు.. రసాయన ఎరువుల ధరలకు ఆకాశమే హద్దుగా మారింది. విత్తనాలు, పురుగుమందుల ధరలతోపాటు బాడుగలు, కూ లీ రేట్ల పరిస్థితి ఇందుకు మినహాయింపు కాదు. 2008, 2009 సంవత్సరాలతో పోల్చి చూస్తే పెట్టుబడి వ్యయం రెట్టింపును దాటిపోయింది. ఆయితే ఆ మేరకు దిగుబడులు పెరగకపోగా అతివృష్టి, అనావృష్టి, చీడపీడల వల్ల తగ్గిపోయాయి. ఇదే సమయంలో వాటికి లభించే ధరలు కూడా అంతంతమాత్రంగా ఉండడంతో సాగు ఎంతమాత్రం గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది. గత నెలలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కొద్దిగా మేలనిపించినా ప్రస్తుతం మరింతగా పడిపోవడంతో రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.
పల్లెల్లో దళారీల హవా... పంట దిగుబడులు రైతుల చేతికి వస్తుండడంతో పల్లెల్లో దళారీలు హల్‌చల్ చేస్తున్నారు. ధరలు తగ్గుతున్న క్రమంలో ఇంకా తగ్గుతాయని చెబుతూ తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ కమిటీ నుంచి లెసైన్స్‌కానీ, ఇతర అనుమతులు కానీ లేకుండా పల్లెల్లో పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తూ రైతులను ముంచుతున్నారు.
వేరుశెనగ...
ఈ ఏడాది ఖరీఫ్‌లో 1.50 లక్షల హెక్టార్లలో సాగైంది. హెక్టారుకు రూ.40 వేల పెట్టుబడి పెడితే దిగుబడి 12 క్వింటాళ్లకు మించలేదు. విత్తన సమయంలో క్వింటా రూ. 5వేలు పలికిన ధర రూ.1619 నుంచి రూ.4వేలలోపుగా నడుస్తోంది. 85 శాతం దిగుబడులకు లభిస్తున్న ధర రూ.3వేలలోపే కావడం గమనార్హం. గత నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాలో 50 వేల హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లింది. కాయలు మొలకలు రావడతోపాటు రంగు మారి నాణ్యత లోపించడంతో వ్యాపారులు కన్నెత్తి చూడడంలేదు.
మొక్కజొన్న...
జిల్లాలో 30 వేల హెక్టార్లలో సాగైంది. హెక్టారుకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. హెక్టారుకు 45 క్వింటాళ్ల దిగుబడి వచ్చి రూ.1500 ప్రకారం ధర ఉంటే రైతుకు గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం హెక్టారుకు 25 క్వింటాళ్లలోపే దిగుబడి వచ్చింది. ప్రభుత్వ మద్దతు ధర రూ.1310 ఉండగా బహిరంగ మార్కెట్‌లో నాణ్యతను బట్టి రూ. 1000 నుంచి రూ. 1150 మధ ్యలో ఉంది. ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా నాణ్యత దెబ్బతినడంతో వ్యాపారులు కొనుగోలు చేయకపోవడం, సర్కారీ కౌంటర్లకు వెళితే నిబంధన ప్రకారం సరుకు లేదంటూ తిప్పి పంపుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆముదం, పత్తి..
గత ఏడాదితో పోలిస్తే ఆముదం సాగు తగ్గింది. ఈ ఏడాది 35 వేల హెక్టార్లలో సాగైంది. హెక్టారుకు రూ.35 వేలు పెట్టుబడి కాగా 15 క్వింటాళ్లు కూడా దిగుబడి లభించలేదు. ధర కూడా రూ.3 వేలలోపే ఉండటంతో రైతుకు దిక్కుతోచడం లే దు. పత్తి పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపుకాదు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 1.80 లక్షల హెక్టార్లలో సాగైంది. వర్షాధారం కింద హెక్టారుకు రూ.65 వేల నుంచి లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. ఇప్పటి వరకు వచ్చిన దిగుబడులు తీసుకుంటే హెక్టారుకు 20 క్వింటాళ్లకు మించి వచ్చేలా లేదు. ప్రస్తుతం ధర రూ.5వేల పైనే ఉన్నా రోజురోజుకు తగ్గుతుండడం గమనార్హం.
కష్టజీవికి ‘నష్ట’కాలం
Published Mon, Nov 11 2013 3:26 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM
Advertisement
Advertisement