పట్నంబజారు(గుంటూరు) : ఆర్టీసీ బస్టాండ్‌కు రెండు కిలోమీటర్ల లోపు ప్రైవేట్ బస్సులుంటే.. ఉపేక్షించేది లేదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు చేపడతామని ఆర్టీసీ అధికారులు చెబుతున్న మాటలు నీటిపై రాతలుగా మారుతున్నాయి. నిత్యం బస్టాండ్ సమీపంలో ప్రైవేట్ బస్సులు దందా చేస్తున్నా..పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో ప్రైవేట్ దోపిడీకి అంతులేకుండా పోతోంది. వివరాల్లోకి వెళితే...
నగరంలోని ఎన్టీఆర్ ఆర్టీసీ బస్టాండ్‌కు నిత్యం లక్ష మందికి పైగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలు చేరేందుకు వస్తుంటారు. ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టుగా ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచక పోవడం వల్ల నిత్యం వందలాది ప్రైవేటు వాహనాలు నగరం నుంచి ప్రయాణికులను తీసుకెళ్తున్నాయి. నగరంలో 250కి పైగా ట్రావెల్స్ కార్యాలయాలు ఉన్నాయి. వాటిలో 30 ట్రావెల్స్ వరకు ఆర్టీసీ బస్టాండ్‌కు అతి సమీపంలోనే ఉన్నాయి.
ఆర్టీసీ టిక్కెట్ ధరల కంటే ప్రైవేటు వాహనాలు అధిక ధర వసూలు చేస్తున్నా ప్రజలు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాల్లో తరలి వెళ్తున్నారు. రోజూ 200కు పైగా బస్సులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి, శ్రీశైలం తదితర ప్రాంతాలకు నడుస్తున్నాయి. తద్వారా ఆర్టీసీకి రావాల్సిన లక్షలాది రూపాయల ఆదాయానికి గండి పడుతోంది. ఎన్టీఆర్ బస్టాండ్ ఎదుటే ప్రయాణికులను ఎక్కించుకువెళ్లడం మామూలైపోయింది. రాత్రి సమయంలో ట్రావెల్స్ వాహనదారులు బస్టాండ్‌లోకి వెళ్లి మరీ పలు ప్రధాన ప్రాంతాలకు వెళ్లే ప్లాట్‌ఫాంలపై ఉన్న ప్రయాణికులను ఎక్కించుకెళ్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
‘‘డబ్బుల్’’ ధ మాకా....
ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు బస్టాండ్‌కు వచ్చి సమయానికి బస్సు లేకపోవడమో, ఉన్నా సీట్లు లేకపోవడమో జరిగితే ట్రావెల్స్ వాహనాలను ఆశ్రయించక తప్పడం లేదని పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ట్రావెల్స్ వాహనాల్లో ఆర్టీసీ టిక్కెట్‌తో పోలిస్తే రెట్టింపు వసూలు చేస్తున్నారని, అదేమని అడిగితే ఆ బస్సులకీ ఈ బస్సులకీ తేడా ఉంది.. ఇష్టమైతే ఎక్కండి.. లేకపోతే లేదంటూ డిమాండ్ చేస్తుంటారని ప్రయాణికులు వాపోతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో పూర్తి స్ధాయి సౌకర్యాలు లేకపోవడం ఇందుకు కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం
ఆర్టీసీ ఆదాయానికి గండి కొట్టే విధంగా ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవహరిస్తే ఎట్టిపరిస్ధితుల్లోనూ ఉపేక్షించం. పూర్తి స్ధాయిలో సిబ్బందితో బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో బస్సులు నిలవకుండా చర్యలు చేపడుతున్నాం. పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి మరింత దృష్టి సారిస్తాం. రవాణా, పోలీసు శాఖ అధికారులకు ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవహరంపై ఫిర్యాదు చేయనున్నాం. ఆర్టీసీ యూనియన్ నేతలతో కలిసి ప్రైవేట్ ట్రావెల్స్‌కు అడ్డుకట్ట వేస్తాం.
- జ్ఞానంగారి శ్రీహరి, ఆర్టీసీ ఆర్‌ఎం
ఆర్టీసీ ఆదాయానికి ప్రైవేటు గండి
Published Mon, Jun 15 2015 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 3:45 AM
Advertisement
Advertisement