ప్రైవేట్ బస్సుల నిలువు దోపిడీ
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో కొనసాగుతున్న ఏపీఎన్జీవోల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు పూర్తిగా స్తంభించిపోవడంతో ప్రైవేట్ ఆపరేటర్లపై కాసుల వర్షం కురుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపుతున్న ప్రైవేట్ ఆపరేటర్లు ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్నారు. సాధారణ రోజుల్లో వసూలు చేసే చార్జీల కంటే రె ట్టింపు వసూళ్లకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి సాధారణ రోజుల్లో రూ.650 చార్జీ ఉండగా, ప్రస్తుతం దాన్ని ఏకంగా రూ.1,200కు పెంచేశారు. కొన్ని ట్రావెల్స్ కంపెనీలు సీట్లు బ్లాక్ చేసి రద్దీ అధికంగా ఉందని చెబుతూ అదనపు దోపిడీకి పాల్పడుతున్నాయి. హైదరాబాద్ నుంచి సీమాంధ్ర జిల్లాలకు రాకపోకలు సాగించే సుమారు ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు మరో గత్యంతరం లేక ప్రైవేట్ ఆపరేటర్లు అడిగినంతా చెల్లిస్తున్నారు.
సీమాంధ్రకు పూర్తిగా నిలిచిన ఆర్టీసీ సేవలు...
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు 1,500 ఆర్టీసీ బస్సులు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కాకినాడ, అమలాపురం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. దాదాపు 60 వేల మందికి పైగా ప్రయాణికులు వాటిలో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే ప్రతిరోజూ దాదాపు 500 ప్రైవేట్ బస్సులు కూడా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సీమాంధ్ర జిల్లాలకు రాకపోకలు సాగిస్తాయి. ప్రయాణికుల రద్దీని బట్టి ప్రైవేటు ఆపరేటర్లు కొన్ని అదనపు బస్సులు ఏర్పాటు చేస్తుంటారు. ప్రస్తుతం సమ్మె కారణంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ అందినకాడికి దోచుకుంటున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం, ఆ తర్వాత రోజు వరలక్ష్మివ్రతం, ఇక శని, ఆదివారాల్లో సెలవు దినాలు కావడంతో చాలామంది సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడం, రైల్వే రిజర్వేషన్ లేకపోవడం వంటి కారణాలతో ప్రైవేట్ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆన్‌లైన్‌లోనే డబుల్ చార్జీలు ప్రకటించేసి బుకింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.
రాజమండ్రికి రూ.1,400 వసూలు చేశారు
నేను శుభాకార్యం నిమిత్తం రాజమండ్రి వెళ్లాలి. ఎప్పుడూ ట్రైన్‌లోగానీ లేదంటే ఆర్టీసీ బస్సులోగానీ వెళ్లేవాడిని. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉండడంతో తప్పనిసరై ట్రావెల్స్ బాట పట్టాల్సి వచ్చింది. రూ.650 టికెట్‌ను రూ.1,400 పెట్టి కొనుక్కోవాల్సి వచ్చింది.
-కిషోర్, మధురానగర్
ఎప్పుడూ ఇంత రేటు చూడలేదు
నేను ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో టికెట్ రేట్లు ఉండటం ఎప్పుడూ చూడలేదు. ట్రావెల్స్ నిర్వాహకులు ఇష్టానుసారంగా ప్రయాణ చార్జీలను వసూలు చేయడం బాధాకరం. అత్యవసర పనులపై వెళ్లేవారి పరిస్థితి మరింత దారుణం. విజయవాడకు మామూలుగా రూ.300తో వెళ్లేవాడిని. ఇప్పుడు రూ.600 పెడితే గానీ వెళ్లలేని పరిస్థితి వచ్చింది.
-అవినాష్, అమీర్‌పేట్.