ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ కొరడా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఎనిమిది ప్రైవేటు బస్సులను అధికారులు సీజ్ చేశారు.
=పర్మిట్ లేకుండా తిరుగుతున్న 8 బస్సుల సీజ్=వేకువజాము నుంచే తనిఖీలు
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ కొరడా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఎనిమిది ప్రైవేటు బస్సులను అధికారులు సీజ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దగ్ధం ఘటన నేపథ్యంలో గురువారం తెల్లవారుజాము నుంచి జిల్లాలో రవాణా శాఖ అధికారులు మూడు ప్రాంతాలలో ముమ్మరంగా ఈ తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా జాతీయ రహదారిపై వెళ్లే బస్సులను ఆపి ఫిట్‌నెస్ పరిశీలించారు.
డ్రైవర్ల ఫిట్‌నెస్‌ను కూడా తనిఖీ చేశారు. కొన్ని బస్సులు పర్మిట్ కూడా లేకుండా తిరుగుతున్నట్టు ఈ సందర్భంగా వెల్లడైంది. సీజ్ చేసిన బస్సులను గన్నవరంలోని ఫిట్‌నెస్ సెంటర్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. కేశినేని ట్రావెల్స్, సాయిశ్రీకృష్ణ ట్రావెల్స్, ఆరెంజ్ ట్రావెల్స్, ధనుంజయ్ ట్రావెల్స్, భాగ్యలక్ష్మి ట్రావెల్స్, వీఆర్‌ఎన్ ట్రావెల్స్, ఆర్పీ ట్రావెల్స్, మూన్‌లైట్స్‌కు చెందిన బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు వివరించారు.
ప్రయాణికులు ఇబ్బందిపడకుండా వారిని గమ్యస్థానాలకు చేర్చి వచ్చి స్వాధీనం చేయాలని ఆర్టీఏ అధికారులు ఆ బస్సుల డ్రైవర్లకు ఉత్తర్వులిచ్చారు. ఈ బస్సులకు కాంట్రాక్టు క్యారియర్స్‌గా తక్కువ మొత్తం ట్యాక్స్ కట్టి, స్టేజ్ క్యారియర్స్‌గా వినియోగిస్తూ రవాణా శాఖను మోసగిస్తున్నారు. ఈ బస్సులలో రెండు కర్నాటకకు చెందినవి. గురువారం తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల వరకు గన్నవరం, ఇబ్రహీంపట్నం, విజయవాడ వారధి వద్ద తనిఖీలు చేశారు.
డీటీసీ సీహెచ్ శివలింగయ్య పర్యవేక్షణలో 17 మంది ఇన్‌స్పెక్టర్లు తనిఖీలలో పాల్గొన్నారు. డీ టీసీ శివలింగయ్య ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ జిల్లాలో బస్సుల ఫిట్‌నెస్‌పై తరచూ తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో రిజిస్టరైన 498 బస్సుల ఫిట్‌నెస్‌పై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు.