
జోరుగా ముందస్తు అడ్మిషన్లు
ప్రైవేటు స్కూల్స్ అడ్డగోలు అడ్మిషన్లకు తెరలేపాయి. విద్యా సంవత్సరం ముగింపుకాకముందే ముందస్తు› ప్రవేశాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెడుతున్నాయి. ఇస్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ, నిలువు దోపిడీ చేస్తున్నాయి. టెక్నో, ఈ టెక్నో, ఈ స్మార్ట్ అంటూ రకరకాల పేర్లతో వసూళ్ల పర్వానికి తెరలేపాయి. నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతున్నా విద్యాశాఖాధికారులు నిద్రమత్తులో జోగుతుండడం విమర్శలకు తావిస్తోంది.
► నిబంధనలకు నీళ్లొదులుతున్న కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్
► అధిక ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకోని విద్యాశాఖ
కడప ఎడ్యుకేషన్: ప్రస్తుత విద్యా సంవత్సరం ముగియక ముందే కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు మొదలు పెట్టాయి. ముందుగా సీట్ బుక్ చేసుకుంటే రాయితీ ఇస్తామని మభ్యపెడుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ పడుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి స్కూల్లో నిర్ణీత ఫీజుల బోర్డులు ఏర్పాటు చేసి విద్యా సంవత్సరం ముగిశాక వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేసుకోవాలి. కానీ, నగరంలోని కొన్ని స్కూళ్లు చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రీతిలో వ్యవహరిస్తున్నాయి. ‘బ్రాండ్’ పేరు చెప్పుకుని అడ్డగోలుగా ఫీజులు దండుకుంటున్నాయి.
యాజమాన్యాలపై చర్యలేవీ..?: నిబంధనలు పాటించని యాజమాన్యాలపై విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వారి ఆగడాలకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. నర్సరీ నుంచి పదవ తరగతి వరకూ ముందస్తు అడ్మిషన్లకు తెరలేపి.. అందిరన కాడికి దండుకుంటున్నాయి. నర్సరీకే రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకూ ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నారు. దీనికి స్కూల్ యూనిఫాం, పుస్తకాలు అదనం. వీటన్నింటిని అంగీకరించి ముందుగానే అడ్మిషన్ ఫీజు మొత్తం చెల్లించాలి. లేకపోతే అడ్మిషన్ ఇచ్చేదే లేదని తెగేసి చెబుతున్నట్లు సమాచారం.
వసతులు లేకున్నా...: కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనీస వసతులు లేకున్నా రూ. వేలల్లో ఫీజులు వసూలు చేస్తుండడంతో తల్లిదండ్రులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం పదవ తరగతిలోపు విద్యార్థులకు రూ. 10 వేలలోపే ఫీజులు వసూలు చేయాల్సి ఉంది. కానీ, ఈ నిబంధన ఎక్కడ అమలుకు నోచుకోవడం లేదు.
ఆగడాలకు అడ్డుకట్ట వేసే వారేరీ.?: తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రైవేటు స్కూల్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీని ఆసరాగా తీసుకున్న కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లొది వసూళ్ల పర్వానికి తెరలేపాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ విద్యా సంస్థ కూడా డొనేషన్లు వసూలు చేయకూడదు. పాఠశాలల్లో తాము వసూలు చేసే ఫీజు వివరాలను తరగతుల వారీగా నోటీసు బోర్డులో ఉం చాలి. కానీ, ఈ నిబంధన ఏ ఒక్క పాఠశాలలో కూడా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు.
ప్రైవేటు టీచర్లకు టార్గెట్..: జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్లు చేయించుకునేందుకు యజమాన్యాలు ఆయా సూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు టార్గెట్ పెడుతున్నాయి. ఒక్కొక్కరికి 10 నుంచి 15 అడ్మిషన్లు చేయించాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. టార్గెట్ పూర్తి చేయకుంటే ఉద్యోగానికి ఎసరు పెడుతున్నట్లు తెలుస్తోంది.
అడ్మిషన్లు చేస్తే చర్యలు తీసుకుంటాం: కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్‌లో విద్యా సంవత్సరం ముగియక ముందే అడ్మిషన్లు చేయకూడదు. అలా చేసుకుంటే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఆరోపణలు వస్తున్న స్కూళ్లపై విచారించి తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
-----పొన్నతోట శైలజ, ఇన్‌చార్జి డీఈఓ