కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతమవుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా ఆందోళనల్లో పాల్పంచుకుంటున్నారు. అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న నేతల తీరును ఎండగడుతున్నారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సైతం ఉద్యమ బాట పట్టడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ ఉద్యమం కోసం లెక్కచేయడం లేదు. అయితే అత్యవసర పరిస్థితుల్లో రాకపోకలు సాగించాల్సిన సమయంలో ప్రైవేట్ వాహన యజమానులు నిలువుదోపిడీ చేస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మామూలు సమయాల్లో హడావుడి చేసే సివిల్ పోలీసులు, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వాహనాలపై దృష్టి సారించకపోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. అదేవిధంగా ఎలాంటి లెసైన్స్‌లు లేని.. కండీషన్‌లో లేని వాహనాలను సైతం రోడ్డెక్కిస్తుండటంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. బస్సులు తిరక్కపోవడంతో రూ.5 నుంచి రూ.10 వరకు అదనంగా వసూలు చేసినా పెద్దగా భారం అనిపించదని.. ఏకంగా రెట్టింపు చార్జీలు వసూలు చేస్తే ఎలాగని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఉద్యమంలో అందరూ పాల్పంచుకుంటున్న తరుణంలో వాహన యజమానులు ఇలాంటి దోపిడీకి పాల్పడటం తగదని వారు వాపోతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. అదేవిధంగా వివిధ పనుల నిమిత్తం పల్లెల నుంచి పట్టణాలకు రావడం జరుగుతోంది. నగరానికి సమీపంలోని కోడుమూరు, డోన్, నందికొట్కూరు తదితర ప్రాంతాల నుంచి సాధారణ రోజుల్లో వసూలు చేసే మొత్తానికి రెండింతలు డిమాండ్ చేస్తుండటం గమనార్హం. కర్నూలు నుంచి ఎమ్మిగనూరుకు ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ చార్జీ రూ.52లు కాగా.. ప్రస్తుతం జీపులు, టాటా మేజిక్ ఆటోలకు రూ.100 వసూలు చేస్తున్నారు. ఆదోనికి రూ.150, కోడుమూరు, నందికొట్కూరు, వెల్దుర్తి, గూడూరుకు రూ.30 నుంచి రూ.50.. నంద్యాల, డోన్, ఆత్మకూరు, బేతంచెర్ల తదితర ప్రాంతాలకు రూ.100కు పైగా చార్జీ తీసుకుంటుండటంతో ప్రయాణికులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక బెంబేలెత్తుతున్నారు.
ఇదే సమయంలో కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కిస్తుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్పందించి చార్జీల నియంత్రణకు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
‘ప్రైవేట్’ దోపిడీ
Published Mon, Sep 2 2013 3:30 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM
Advertisement
Advertisement