![Private Wine Shops Are Closed In Guntur District - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/30/wine5.jpg.webp?itok=mt_hwUfv)
ప్రభుత్వ మద్యం దుకాణం
సాక్షి, గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మద్యం షాపుల గడువు సోమవారంతో ముగియనుంది. దశలవారీ మద్య నిషేధంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రైవేట్ మద్యం షాపుల తొలగింపు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నేటితో ప్రైవేట్ మద్యం షాపుల గడువు రాష్ట్ర వ్యాప్తంగా ముగియనుంది. మంగళవారం నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో 355 ప్రైవేట్ మద్యం దుకాణాలు ఉన్నాయి. దశలవారీ మద్య నిషేధంలో భాగంగా ఏటా 20 శాతం మద్యం షాపులు తొలగిస్తామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాన్ని సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కొన్ని నెలల్లోనే ఆయన నిలబెట్టుకున్నారు.
జిల్లాలో 282 దుకాణాలు మూత
సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా 38 ప్రభుత్వం మద్యం దుకాణాలను ఎక్సైజ్ శాఖ జిల్లాలో ప్రారంభించి విక్రయాలు కొనసాగిస్తోంది. మంగళవారం నుంచి 282 ప్రభుత్వ మద్యం దుకాణాలు జిల్లా వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. బెల్టు షాపుల నిర్మూలన, మద్యం అమ్మకాలకు చెక్‌పెట్టడం కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం ఈ మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా భవనాల గుర్తింపు, ఆయా భవనాల్లో ఫర్నిచర్ ఏర్పాటు దాదాపు పూర్తయింది.
మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లో ఉండే మద్యం షాపుల్లో ఒక సూపర్‌వైజర్, ముగ్గురు సేల్స్‌మెన్‌లు, మిగిలిన ప్రాంతాల్లో ఒక సూపర్‌వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్‌లు చొప్పున జిల్లా వ్యాప్తంగా 282 మంది సూపర్‌వైజర్‌లు, 731 మంది సేల్స్‌మెన్‌లను ఎక్సైజ్ అధికారులు నియమించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే మద్యం దుకాణాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకూ విక్రయాలు నిర్వహిస్తారు. మద్యం కొనుగోళ్లపై సైతం ఆంక్షలు విధించారు. ఒక వ్యక్తికి ఏ సైజులో అయినా సరే.. మూడు బాటిళ్ల వరకూ కొనుగోలుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. విదేశీ మద్యం కూడా మూడు బాటిళ్లకు మించి కొనుగోలు చేయకూడదని ఆంక్షలు విధించారు. స్పిరిట్ మూడు బల్క్ లీటర్లు, కల్లు 2 బల్క్ లీటర్లు, బీరు 650 మిల్లీలీటర్ల బాటిళ్లు ఆరు వరకూ కొనుగోలు చేసేందుకు అనుమతిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment