
ఇగ్నో కోర్సులతో ఉద్యోగావకాశాలు పుష్కలం
గుంటూరు ఎడ్యుకేషన్: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) అందిస్తున్న కోర్సులతో పుష్కలమైన ఉగ్యోగావకాశాలు లభిస్తున్నాయని ఇగ్నో ప్రాంతీయ కేంద్ర డైరెక్టర్ డాక్టర్ పి.శరత్‌చంద్ర పేర్కొన్నారు. పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాల ప్రాంగణంలోని ఇగ్నో అధ్యయన కేంద్రంలో ఆదివారం 2025 జనవరిలో భాగంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు ఇండక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. శరత్‌చంద్ర మాట్లాడుతూ ఇగ్నో అందిస్తున్న వివిధ రకాల కోర్సుల గురించి వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో ఇగ్నో అందిస్తున్న మెటీరియల్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇగ్నో సైట్‌లో పొందుపరచి ఉంటుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని చక్కగా చదువుకోవాలని చెప్పారు. ఇగ్నో అధ్యయన కేంద్ర సమన్వయకర్త డాక్టర్ డీవీ చంద్రశేఖర్ మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా చదువుకోవాలనే లక్ష్యం కలిగిన వారు ఇగ్నో ద్వారా వారి ఆశయాన్ని నెరవేర్చుకోవాలని సూచించారు. ఇగ్నో వంటి ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో చదవడం ద్వారా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్ట్ బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్స్ గురించి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో అధ్యయన కేంద్ర కౌన్సిలర్ డాక్టర్ ఎంఎస్ నారాయణ, సహాయ సమన్వయకర్తలు డాక్టర్ పి.దేవేంద్ర గుప్త, ఎం.మార్కండేయులు, సిబ్బంది పాల్గొన్నారు.