పరారీలో మరో రౌడీషీటర్
తెనాలిరూరల్: పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్ ఇచ్చాడన్న కక్షతో కానిస్టేబుల్‌ను హత్య చేసేందుకు యత్నించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో రౌడీషీటర్ పరారీలో ఉన్నాడు. స్థానిక టూ టౌన్ సర్కిల్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఐ రాములనాయక్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణ వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కన్నా చిరంజీవిపై ఈ నెల 24న హత్యాయత్నం చేసిన చెంచుపేటకు చెందిన చేబ్రోలు జాన్ విక్టర్, మంగళగిరికి చెందిన షేక్ బాబూలాల్ అలియాస్ కరీముల్లా, అయితానగర్ కు చెందిన దోమ రాకేష్‌ను ఆదివారం అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న రౌడీషీటర్ వేము నవీన్ అలియాస్ కిల్లర్ పరారీలో ఉన్నాడు. అయితానగర్‌లో ఉండే కానిస్టేబుల్ చిరంజీవి గతంలో త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించాడు. జాన్ విక్టర్‌పై టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ ఉంది. గంజాయి విక్రయం, దొంగతనం, కొట్లాట కేసులలో నిందితుడు. దోమ రాకేష్ కూడా చెడు వ్యసనాలకు బానిస. పలు కేసులలో నిందితుడు. కానిస్టేబుల్ చిరంజీవి గతంలో త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే సమయంలో గంజాయి సేవిస్తున్నారన్న కారణంగా జాన్ విక్టర్, దోమ రాకేష్‌లను పలు దఫాలు స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చిరంజీవిపై కక్ష పెంచుకున్న నిందితులు, అతనిని అంతమొందించాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితానగర్‌కు చెందిన రౌడీ షీటర్ వేము నవీన్ అలియాస్ కిల్లర్ సహాయం కోరారు. ఈనెల 24న జాన్ విక్టర్, దోమ రాకేష్‌ను అయితానగర్ రావాల్సిందిగా వేము నవీన్ కోరాడు. వారిరువురు కరీముల్లాను వెంటబెట్టుకొని అయితానగర్ చేరారు. నలుగురు కలిసి మద్యం తాగి, కానిస్టేబుల్ విధి నిర్వహణకు వెళ్లే సమయంలో అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. అయితానగర్ అంబేడ్కర్ విగ్రహం రోడ్డులో చిరంజీవి వస్తాడన్న విషయం తెలుసుకున్న నలుగురు రాత్రి 9.30 గంటల సమయంలో అక్కడ మాటు వేశారు. బైక్‌పై వెళుతున్న చిరంజీవిని అటకాయించారు. అతనితో వాగ్వావాదానికి దిగారు. అదే సమయంలో కరిముల్లా, రాకేష్ ఇరువురు చిరంజీవిని గట్టిగా పట్టుకోగా, రౌడీషీటర్ నవీన్ అతనిపై దాడి చేశాడు. జాన్ విక్టర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో చిరంజీవిపై దాడి చేశాడు. పెనుగులాటలో వారి నుంచి తప్పించుకున్న చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తుండగా, వారు లింగారావు సెంటర్‌లో ఉన్నట్లు తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. రౌడీ షీటర్ నవీన్ పరారయ్యాడు. నిందితుడు ఉపయోగించిన కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేసిన సందర్భంగా ఎస్పీ అభినందించినట్లు సీఐ రాముల నాయక్ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ బురాన్‌షరీఫ్, సిబ్బంది ఉన్నారు.