వినాయకుడికే విఘ్నాలు..! | Problems also for lord Ganesh Chaturthi celebrations | Sakshi
Sakshi News home page

వినాయకుడికే విఘ్నాలు..!

Published Mon, Sep 7 2015 3:26 AM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM

వినాయకుడికే విఘ్నాలు..!

వినాయకుడికే విఘ్నాలు..!

సాక్షి, కర్నూలు : ఏ కార్యక్రమమైనా నిరంతరాయంగా సాగాలంటే వినాయకునికి పూజలు చేస్తారు. తలచుకున్న కార్యక్రమం నిర్విఘ్నంగా విజయవంతం కావాలని ఆయనను వేడుకుంటారు. విఘ్నేషుని  పూజతో ప్రారంభించిన కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా సాగుతుందని విశ్వసిస్తారు. విఘ్నాలు తొలగించే వినాయకుడికే పాపం విఘ్నం వచ్చి అడ్డుపడింది. వర్షాలు సకాలంలో కురవకపోవడం.. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు పెరగకపోవడం కారణంగా కేసీ కెనాల్‌కు నీటి విడుదలపై సందేహాలు నెలకొన్నాయి.

దీంతో రానున్న వినాయక నిమజ్జనానికి విఘ్నం ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. వారం రోజులపాటు పూజలందుకున్న తర్వాత నిమజ్జనానికి తరలే వినాయకుడికి అన్ని విఘ్నాలు ఏర్పడే దుష్ట పరిస్థితి ఏర్పడటంపై భక్తులలో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. 2002లో మాదిరిగానే ఇప్పుడూ ప్రత్నామ్నాయ ఏర్పాట్లపై జలవనరుల శాఖ అధికారులు దృష్టి సారించడం సంక్లిష్ట పరిస్థితికి అద్దం పడుతోంది.

 వినాయక చవితి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించటంలో కర్నూలుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోని జంటనగరాలలో జరిగే ఉత్సవాలకు దీటుగా కర్నూలులో నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కర్నూలు మొదటిస్థానంలో నిలుస్తోంది. గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రతీయేటా వినాయకఘాట్ వద్ద కేసీ కెనాల్‌లో నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కమిటీ నిర్ణయించిన మేరకు కాలనీల్లో ప్రతిష్టించిన విగ్రహాలకు వారం రోజులపాటు పూజలు అందజేసి వాటిని కేసీ కెనాల్‌లో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఆనవాయితీకి ఈసారి ఆటంకాలు ఎదురవబోతున్నాయి.

 సుంకేసులకు తగ్గిన ఇన్‌ఫ్లో...
 కర్నూలు నగరానికి 19 కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర నదిపై సుంకేసుల రిజర్వాయరును నిర్మించారు. ఎగువ ప్రాంతమైన తుంగభద్ర డ్యాం నుంచి విడుదలయ్యే నీటిని ఈ రిజర్వాయరు ద్వారానే కేసీ కెనాల్ ఆయకట్టు భూములకు విడుదల చేస్తున్నారు. ఇందులో నుంచే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని వందలాది గ్రామాల ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. మరో నెలరోజుల్లో వర్షాలు సమృద్ధిగా పడి.. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నీటి మట్టం పూర్తిస్థాయికి చేరుకుని, ఎగువ భాగం నుంచి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో ఉంటేనే ఈ ఏడాది సుంకేసుల ద్వారా కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయడం సాధ్యపడుతుంది.

లేకుంటే పరిస్థితులు భిన్నంగా ఉంటే మాత్రం కాలువకు నీటి విడుదల ప్రశ్నార్థకమే అవుతుంది. ఇప్పటికీ ఎగువ భాగం నుంచి ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో 1.02 టీఎంసీల సామర్థ్యం ఉన్న సుంకేసులలో ప్రస్తుతం 0.90 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. సెప్టెంబరు రెండోవారానికి ఈ నీళ్లు అయిపోయి రిజర్వాయరు అడుగంటే పరిస్థితి ఉంది. ఇదే జరిగితే తాగునీటి కష్టాలు తప్పవు. రోజురోజుకు సుంకేసులలో తగ్గుతున్న నీటి మట్టం  ఇటు అధికారులను, అటు భక్తులను కలవరపెడుతోంది.  

 ఈసారి జోహరాపురం హెడ్‌రెగ్యులేటరీ గేట్ల మూసివేత...
 ప్రతియేటా నిర్వఘ్నంగా సాగిపోతున్న వినాయక నిమజ్జన కార్యక్రమానికి 15 ఏళ్లలో రెండోసారి ఆటంకం ఎదురుకానుంది. 2002 సంవత్సరంలోనూ వినాయక నిమజ్జన సమయానికి నీటి ఇక్కట్లు తలెత్తాయి. కేసీ కెనాల్‌కు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేసే పరిస్థితి లేకపోవడంతో అప్పుడు వినాయకఘాట్ సమీపంలో ఉన్న బ్రిడ్జి కింద 8 అడుగుల ఎత్తుతో గోడలు కట్టి నిమజ్జనం కోసం కొంత మేర నీటిని నిల్వ చేశారు. అయితే అప్పట్లో వందలాది భారీ విగ్రహాలు పూర్తిగా నిమజ్జనానికి నోచుకోలేకపోయాయి.

చాలా విగ్రహాలను భక్తుల మనోభావాలకు భిన్నంగా పగులగొట్టాల్సి వచ్చింది. ఈ విషయంలో అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా జలవనరుల శాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్నామ్నాయంగా ఈసారి జోహరాపురం వద్ద నుంచి హెడ్‌రెగ్యులేటరీ గేట్లను దించివేసి వినాయకఘాట్‌కు అటు ఇటు సుమారు 1.50 కిలోమీటర్ల మేర నీటిని నిల్వ చేయాలని నిర్ణయించారు.
 
 17 నుంచి గణేష్ ఉత్సవాలు -25న నిమజ్జనం
 కర్నూలు(హాస్పిటల్): ఈ నెల 17 వ తేదీ నుంచి కర్నూలు నగరంలో గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతాయని గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ కార్యదర్శి కిష్టన్న పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక వినాయక్ ఘాట్ లోని వినాయక మందిరంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాలు, ఊరేగింపులో ఏదైన సమస్య వస్తే కేంద్ర కమిటీ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రశాంతమైన వాతవరణంలో ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. పర్యావరణాన్ని పరిగణలోకి తీసుకొని మట్టి వినాయకులకు ప్రాధాన్యత నివ్వాలన్నారు. కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు రంగస్వామి, సందడి సుధాకర్, సందడి మహేష్, కాళింగి నరసింహవర్మ, నాగరాజు, ప్రసాద్ పాల్గొన్నారు.  
 
 ఎలాంటి ఆటంకాలు లేకుండానే జరగాలి :
 ఈ ఏడాది చెరువులు, కుంటలతోపాటు నదుల్లోనూ చుక్క నీరు కనిపించడం లేదు. 2002లోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నిమజ్జన ఉత్సవం కోసం ఆనకట్ట మాదిరిగా గోడకట్టి ఉత్సవాన్ని జరిపించాం. ఈ ఏడాదీ అలాంటి పరిస్థితి నెలకొనదని భావిస్తున్నాం. వరుణదేవుని కరుణతో వర్షాలు సమృద్ధిగా పడి ఎలాంటి ఆటంకాలు లేకుండా నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఒకవేళ ఏదైన అనుకోని విఘ్నం ఏర్పడితే మాత్రం అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
   -నరసింహవర్మ, కార్యనిర్వాహక కార్యదర్శి, గణేష్ మహోత్సవ  కేంద్ర కమిటీ
 
 కేసీ కెనాల్‌కు నీళ్లు వస్తాయి
 రెండు నెలలుగా వర్షాభావం ఉంది. తుంగభద్ర డ్యాంలో ఇప్పటికే 75 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇప్పటికే ఎల్‌ఎల్‌సీ ప్రతి రోజూ 350-400 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. అయితే రానున్న రోజుల్లో సమృద్ధిగా వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వర్షాలు వస్తే మాత్రం వారం రోజుల్లో కేసీ కెనాల్‌కు నీళ్లు వస్తాయనే ఆశాభావం ఉంది. ఒకవేళ ఆ పరిస్థితి లేకపోతే మాత్రం వినాయక నిమజ్జనానికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటాం.  
-చంద్రశేఖరరావు, ఎస్‌ఈ, జలవనరుల శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement