చంద్ర గ్రహణమా? హారమా?
చంద్ర గ్రహణమా? హారమా?
Published Mon, Jun 9 2014 2:53 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నూతన ప్రభుత్వాలు కొలువు దీరాయి. భారత దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. విభజన ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోనూ అనేక సమస్యలు ప్రజలను ఇబ్బంది గురి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి మిగులు బడ్జెట్ ఉన్నందున నిధుల సమస్య లేనప్పటికి, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాటు లోటు బడ్జెట్ తో ఆరంభమైంది. ఆంధ్రప్రదేశ్ ను అనేక సమస్యలు చుట్టుముట్టి ఉన్నాయి. రాజధాని నిర్మాణం ప్రధానమైన సమస్య కాగా.. నిధుల సమీకరణ నూతన ప్రభుత్వానికి మరో సమస్యగా మారాయి.
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత ప్రధాన సమస్యకాగా, ఇరిగేషన్, ఉద్యోగాలు కల్పించడంలాంటి ఇబ్బందులు కొత్త ప్రభుత్వాన్ని వెంటాడటం ఖాయం గా కనిపిస్తున్నాయి. విద్యుత్ కొరత కారణంగా వ్యవసాయంపై ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారీ సంఖ్యలో ఉద్యోగాలు సృష్టిస్తామని నిరుద్యోగుల్లో ఆశలు రేపిన అంశం మరింత జటిలం కానుంది.
అలాగే ఆంధ్రప్రదేశ్ లో లోటు బడ్జెట్ కారణంగా మౌళిక సదుపాయాల ఏర్పాటు, ప్రకృతి వైపరిత్యం, ఉద్యోగాల సృష్టి లాంటి అంశాలు ప్రధాన సమస్యగా మారనున్నాయి. విభజన ప్రభావం రానున్న మూడు, నాలుగు సంవత్సరాల్లో రెండు రాష్ట్రాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఐతే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కొంత అనుభవం ఉన్న నేత ముఖ్యమంత్రి కావడం కొంత ఉపశమనమైతే.. నిధుల లోటు, మౌళిక సదుపాయాలు ఏర్పాటు కత్తిమీద సాముగా మారాయి. అయితే నిధుల లోటుతో ఏర్పాటైన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉంది. వ్యవసాయ, మహిళ సంఘాలు, ఇతర రుణ మాఫి కార్యక్రమాల అమలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఇక తెలంగాణలోనూ కొత్త ప్రభుత్వానికి రుణ మాఫి విషయం సవాల్ గా మారింది. సంవత్సరం లోపు లక్ష రూపాయల రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనపై నిరసనలు తీవ్రస్థాయిలోనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుల ముందు అనేక సమస్యలు ముందున్నాయి. విభజన నేపథ్యంలో ఓ క్లిష్ట పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో పాలన చంద్రులకు గ్రహణంగా మారుతుందా లేక.. సమస్యల పరిష్కారంలో చొరవ చూపి కష్టాలను గట్టెక్కించే విధంగా ఇద్దరి పాలన ఇరు రాష్ట్రాలకు హారంగా మారుతుందా అనే ప్రశ్నలకు సమయమే సమాధానం కానుంది.
Advertisement