సమస్యలు పరిష్కరించాలి
Published Tue, Jan 28 2014 3:01 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కారించాలని కోరుతూ అంగన్‌వాడీ సిబ్బంది సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. సమస్యలను పరిష్కరించాలని కొంతకాలంగా పోరాటం చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ఆంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ కలెక్టరేట్ ముట్టడికి పిలుపు నిచ్చింది. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీలు ఉదయానికే కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా నాయకులు ఎ.విజయమ్మ, ఎం.ఉమామహేశ్వరి మాట్లాడుతూ, ఐసీడీఎస్‌తో పాటూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో భాగస్వాములైన తమ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. పెంచిన జీతం ఇంతవరకు అమలు చేయలేదన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రసూతి సెలవులతో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సదుపాయాలు కల్పించాలని కోరారు. అంగన్‌వాడీల ధర్నా విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ పీడీ శ్రీనివాస్ సిబ్బంది వద్దకు వచ్చి సమస్యలు విన్నారు. సమస్యలపై చర్చించేందుకు యూనియన్ నాయకులతో జాయింట్ మీటింగ్ పెడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు విజయ, పి. జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
Advertisement