మగువలపై విరిగిన లాఠీ!
♦ ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలపై పోలీసుల కర్కశత్వం
♦ ధర్నాకు వచ్చిన మహిళలపై దారుణంగా లాఠీచార్జి
♦ భయంతో పరుగులు తీసి మురుగుకాల్వలో పడిన వైనం
♦ ఐదుగురు మహిళలు, సీఐటీయూ నాయకుడికి గాయాలు
♦ బట్టలు ఊడిపోతున్నా పట్టించుకోని దాష్టీకం
♦ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం
ఎంతటి కాఠిన్యం... మహిళల్ని హడలెత్తించారు... భయాందోళనలు కల్పిం చి పరుగులెత్తించారు... హక్కులపై ఉక్కు పాదం మోపారు... కలెక్టరేట్ సాక్షిగా మహిళల రక్తం కళ్లజూశారు... సమస్యలు తీర్చాలని వేడుకుంటుంటే ఈడ్చి పారేశారు... కడుపు మండిపోతోందంటే కాఠిన్యం ప్రదర్శిం చారు... బకా యిలివ్వండంటే బహిరంగంగా బాదేశారు... వేతనాలిచ్చి బతి కించమంటే లాఠీలతో చావ బాదారు... శ్రమకు తగ్గ ఫలితం ఇమ్మంటే రక్తం చిందేలా కొట్టారు... జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు సోమవారం నిర్వహించిన ఆందోళనపై సిసలైన జులుం ప్రదర్శించారు. కొత్త ఎస్పీ బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే పోలీసులు తమ ప్రతాపం చూపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో లాఠీఛార్జి చేసి మరో బషీర్‌బాగ్‌ను తలపించారు.
విజయనగరం కంటోన్మెంట్: జిల్లా కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అంగన్వాడీ, ఆశ, ఆయుష్ కార్యకర్తల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అంతవరకూ సామరస్యంగా సాగిపోతున్న కార్యక్రమంలో నేతలు ప్రసంగిస్తుండగా పోలీసులు ఒక్కసారిగా వారిపై విరుచుకుపడటంతో ఉద్రిక్తత నెలకొంది. తొలుత జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సీఐటీయూ నాయకులు, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయూష్ కింది స్థాయి ఉద్యోగులు ధర్నాకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా పోలీసులు ఒక్కసారిగా వారి వద్దకు వచ్చి ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేశారు.
మహిళలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మహిళలని చూడకుండా పోలీసులంతా వారిని ఈడ్చుకెళ్లడంతో మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్పటికే భారీ సంఖ్యలో కాపుకాసి ఉన్న మహిళా పోలీసులు, స్పెషల్ ఫోర్స్ సిబ్బంది వారిపై విరుచుకుపడ్డారు. లాఠీఛార్జికి ఆదేశాలు రావడంతో సాధారణంగా కనిపించిన పోలీసులంతా ఉగ్రరూపం దాల్చా రు. చేతిలోని లాఠీలతో ఒక్కసారిగా మహిళలపైకి దూసుకొచ్చారు. వారంతా భయాందోళనలతో తలోదిక్కు కు పరుగులెత్తారు. అప్పటికే లాఠీదెబ్బల కు గాయపడిన వారంతా కిందపడి మరింత నరకయాతన అనుభవించారు.
మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా?
ధర్నా చేస్తున్న మహిళలను ఈడ్చుకెళ్లిన పోలీసులు వారి బట్టలు ఊడిపోతున్నా పట్టించుకోలేదు. కొందరు వయసులో పెద్దయిన మహిళలున్నా ఖాతరు చేయలేదు. మహిళలంటే ఇదేనా గౌరవం అంటూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. దెబ్బలను చూపిస్తూ విలపించారు. ఆవేదనతో ఆర్తనాదాలు చేశారు. మీ కేం అన్యాయం చేశామని ఇలా చావగొట్టారు? ఆడాళ్లను కొట్టి రమ్మని మిమ్మల్ని చంద్రబాబు నాయుడు పంపించాడా? ఇంతకు ముందు తొమ్మిదేళ్లు ఇంట్లో కూచున్నాడే! మర్చిపోయాడా? మళ్లీ అదే గతి పడుతుందనేనా ఇలాంటి వికృత చర్యలకు పాల్పడుతున్నాడని శాపనార్థాలు పెట్టారు. మీకు నెలయ్యే సరికి జీతాలు పడతాయి. మాలా కడుపు మాడితే మీకు మా కష్టాలేమిటో తెలిసొచ్చేవంటూ తిట్ల దండకం అందుకున్నారు.
వేతనాలడిగితే... ఇలా వేధిస్తారా...
రాత్రీ... పగలూ తేడా లేకుండా తాము చాకిరీ చేసి వేతనాలడిగితే ఇలా విచక్షణారహితంగా కొట్టి తరిమేయడం ఎంతవరకు సబబని వారంతా గొల్లుమన్నారు. పోలీసు దెబ్బలకు గాయపడిన వారిని కూడా సాధారణ రీతిలో వ్యానులోనే పడేశారనీ మహిళలు ఆరోపించారు. ఆ దెబ్బలతో మూడు గంటలపాటు స్టేషన్‌లో ఉంచేసి తమను చాలా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలకు గాయాలు
పోలీసుల దాడితో మహిళలంతా తలోదిక్కుకు పరుగులు తీశారు. ఈ దశలో ఒకరినొకరు తోసుకుని కొందరు కిందపడిపోయారు. ఒకవైపు లాఠీ దెబ్బలు... మరోవైపు గాజులు పగిలి రక్కేయడంతో రక్తస్రావమయింది. మరికొందరు భ యంతో పరుగులు తీసి సైకిళ్లు, మోటారు సైకిళ్లపై పడ్డారు. పూసపాటిపాలేనికి చెందిన ఆర్‌గౌరి అనే కార్యకర్త కాలి అం త ర్భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఓ పోలీసు అధికారి వచ్చి గట్టిగా కొట్టారనీ ఆమె కాలు విరిగిపోయిందనీ మహిళలంతా గోల చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఎక్కడికక్కడ అరెస్టులు
కలెక్టరేట్‌వద్ద నిర్వహిస్తున్న మహా ధర్నాకు తరలివస్తున్న నాయకులు, ఆందోళనకారులను ఎక్కడికక్కడే పోలీసులు నిలుపుదల చేసి, అరెస్టు చేశారు. సీఐటీయూ రాష్ట్ర కా ర్యదర్శి, సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి టి.వి.రమణ, జిల్లా ఉపాధ్యక్షుడు టి.జీవ, జిల్లా కార్యవర్గ సభ్యులు బి.వెంకటరావు, బూర్లె రమణ, మధ్యాహ్న భోజన పథకం యూనియన్ జిల్లా కార్యదర్శి బొత్స సుధారాణి, అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు ఎం.ఉమామహేశ్వరి, ఎస్.కోట సీఐటీయూ మండల ఉపాధ్యక్షుడు బత్తిలి రమణను ఆందోళనలో భాగంగా అరెస్టు చేయగా జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డి శంకరరావును హౌస్ అరెస్టు చేశారు. డెంకాడకు చెందిన అంగన్వాడీ జిల్లా కార్యదర్శి మోపాడ కృష్ణవేణి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శి ఎన్.వై.నాయుడు, అంగన్వాడీ గౌరవ అధ్యక్షురాలు ఎం.ఉమామహేశ్వరి, తదితరులు అరెస్టయినవారిలో ఉన్నారు.
చలానా తీయలేదట!
ధర్నాలో తాము చేసిన లాఠీఛార్జికి పోలీసు అధికారులు కొత్త కారణం చెప్పారు. వింత వాదన చేశారు. జిల్లాలో సెక్షన్ –30తో పాటు పలు నిషేధాజ్ఞలు అమలులో ఉ న్నాయనీ... ఎక్కడయినా ధర్నా చేస్తే ముందుగా తెలి యపర్చాలనీ కానీ ఉద్యమకారులు తమకు తెలియజేయలేదన్నారు. దీనిపై తాము ముందుగా తెలియపర్చిన తరువాతే ధర్నాకు దిగామని వారు చెబితే సెక్షన్ –30 ప్రకారం చలానా తీయలేదని బొబ్బిలి డీఎస్పీ సౌమ్యలత వాదించారు. జిల్లాలో చలానాలు తీసే సంప్రదాయం లేదని ఆందోళనకారులు స్పష్టం చేశారు. ధర్నా సమాచారం ఉండటంతో అది విజయవంతం కాకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి నుంచి వచ్చే బస్సులు ఇతర వాహనాలను దారి మళ్లించారు. జేఎన్‌టీయూ జంక్షన్ నుంచి బస్సులను తిప్పేయాలని అక్కడ పోలీసులను మోహరించడంతో పలువురు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జేఎన్‌టీయూ నుంచి కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ప్రజలు నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. మరికొందరు ఆటో డ్రైవర్లు ఇదే సందంటూ రూ.పదిచొప్పున వసూలు చేశారు.