శ్రీకాకుళం పాతబస్టాండ్: అంగన్‌వాడీ కార్యకర్తలకు, సహాయకులకు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన మాదిరిగా ఏపీలో జీతాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రతి కార్యకర్తకు నెలకు రూ. 10,500, సహాయకులకు రూ. 6000 ఇవ్వాలని కోరారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ, అంగన్‌వాడీ వర్కర్సు అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని ఐసీడీఎస్ పీడీ కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు.
సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం స్కీం కార్మికులు, చిరుద్యోగుల నుంచి శ్రమ దోపిడీ చేస్తుందన్నారు. అంగన్‌వాడీలను తెలంగాణ ప్రభుత్వం రెగ్యూలర్ చేసిందని, జీతాలు పెంచి వారిని ఆదుకుందని తెలిపారు. అలాగే ఏపీలోనూ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు సమావేశాలు ప్రతి నెల నిర్వహించాలని, అంగన్‌వాడీలపై రాజకీయ వేధింపులు లేకుండా చూడాలని కోరారు. అంగన్‌వాడీ సంఘం నాయకులు హిమప్రభ, ఎ.సూజాత మాట్లాడుతూ అంగన్‌వాడీలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. వేతనాలు ప్రతి నెల ఇవ్వాలని, నాలుగు నెలల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో పోలీసులు మోహరించారు. కార్యక్రమం ముగింపు సమయంలో ఒక మహిళా కానిస్టేబుల్ స్పృహతప్పి పడిపోయారు. ఆమెను వైద్యసేవలకు తరలించారు.
వేతనాల పెంపులో నిర్లక్ష్యం వద్దు
Published Fri, Apr 7 2017 4:45 PM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement