రచ్చబండలో ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు చేరవేయడంలో మండల అధికారులు జాప్యం చేయడంపై కలెక్టర్ బి.శ్రీధర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రచ్చబండలో ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు చేరవేయడంలో మండల అధికారులు జాప్యం చేయడంపై కలెక్టర్ బి.శ్రీధర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఈ కార్యక్రమం ముగిసినప్పటికీ మెజారిటీ లబ్ధిదారులకు ఇంకా మంజూరు పత్రాలు అందకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా పంపిణీ ప్రక్రియ పూర్తిచేయాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బుధవారం జిల్లాపరిషత్‌లో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, తహసీల్దార్లతో రచ్చబండ కార్యక్రమం పురోగతిపై సమీక్షించారు.
పట్టణ ప్రాంతంలో దాదాపు 75శాతం మందికి మంజూరు పత్రాలు ఎందుకు పంపిణీ చేయలేదని కలెక్టర్ మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్ మున్సిపాలిటీల పరిధిలో పంపిణీ ప్రక్రియ సరిగా లేదని, గ్రామీణ ప్రాంతాలైన ఘట్‌కేసర్, బంట్వారం, శామీర్‌పేట మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నదని అన్నారు. రచ్చబండ కింద జిల్లాకు మంజూరైన రేషన్ కూపన్లలో కేవలం 59శాతం మాత్రమే లబ్ధిదారులకు అందాయని, పట్టణ ప్రాంతాల్లో కేవలం 49శాతమే పంపిణీ జరిగాయన్నారు. మొత్తంగా ఈనెల 15వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
రేషన్ కూపన్లను వీఆర్‌ఓలు, రేషన్ డీలర్ల ద్వారా కాకుండా తహసీల్దార్ కార్యాలయం ద్వారానే తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ నిర్మాణాలు చేపట్టని లబ్ధిదారులను చైతన్యపర్చాలని, ఇందుకు ఈనెల 6వ తేదీ నుంచి 30 వరకు గ్రామాల్లో పర్యటించి సర్పంచ్‌ల సమక్షంలో గ్రామసభలు నిర్వహించాలన్నారు. దీపం పథకం కింద జిల్లాలోని పట్టణ ప్రాంతంలోనే ఇంకా 13వేల గ్యాస్ కనెక్షన్లు పెండింగ్‌లో ఉండడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొత్తగా 18వేల కనెక్షన్లు మంజూరు కానున్నాయన్నారు. గ్రౌండింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తేనే కొత్తవి మంజూరు చేయడం సులభమవుతుందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పంటలు నష్టపోయిన రైతుల వివరాల నివేదికను వెంటనే జి ల్లా యంత్రాంగానికి సమర్పించాలని కలెక్టర్ తనిఖీ బృందాలను ఆదేశించారు. సమావేశంలో సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి, జెడ్పీ సీఈఓ రవీందర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ వరప్రసాద్‌రెడ్డి, డ్వామా పీడీ చంద్రకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.