ప్రతిపాదనలకూ తీరిక లేదా..! | Proposals for both leisure | Sakshi
Sakshi News home page

ప్రతిపాదనలకూ తీరిక లేదా..!

Published Wed, Dec 3 2014 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM

ప్రతిపాదనలకూ  తీరిక లేదా..!

ప్రతిపాదనలకూ తీరిక లేదా..!

ఎంపీ లాడ్స్ విడుదలై నెలలైనా  ప్రతిపాదనల జోలికి పోనీ ఎంపీలు
లేఖలు రాసినా స్పందన కరవు
అక్కరకు రాని రూ.12.5 కోట్లు

 
నిధులిచ్చాం..నియోజకవర్గానికి ఖర్చుపెట్టండంటున్నా జిల్లాలోని ఎంపీలు పట్టించుకోవడం లేదు. పైసల్లేవని ఎమ్మెల్యేలు చెబుతుంటే నిధులు విడుదలైనా ఎంపీలు వాటి జోలికిపోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రప్రభుత్వం ఎంపీ లాడ్స్ (లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ స్కీమ్) విడుదల చేసి నెలలు గడుస్తున్నా చిన్నపాటి అభివృద్ధిపనికి కూడా ప్రతిపాదనలు పంపలేని పరిస్థితి కనిపిస్తోంది.     
 విశాఖపట్నం: జిల్లాలో విశాఖపట్నం, అనకాపల్లి, అరకు పార్లమెంటు సభ్యులు కంభంపాటి హరిబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్), కొత్తపల్లి గీతలతో పాటు రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి ఉన్నారు. వీరితో పాటు మరో రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ కూడా విశాఖ నుంచే ప్రాతినిథ్యం వహిస్తు న్నారు. ఈయన విభజనకు ముందు ఉమ్మడి రాష్ర్టం మెదక్ నుంచి ప్రాతినిథ్యం వహించారు. విభజన తర్వాత నియోజకవర్గాన్ని విశాఖపట్నానికి మార్చుకున్నారు. ఈ విధంగా జిల్లాకు ఏకంగా ఐదుగురు ఎంపీలున్నారు. సాధారణంగా పార్లమెంటు సభ్యునికి ఏటా ఎంపీ లాడ్స్ కింద రూ.5కోట్ల చొప్పున కేటాయిస్తారు. ఎన్డీఎ సర్కార్ గ ద్దెనెక్కిన మరుసటి నెలలోనే 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్కో ఎంపీకి తొలి క్వార్టర్ కింద రూ.2.5కోట్ల మంజూరు చేశారు. జిల్లాలోని ఐదుగురు ఎంపీలకు జూలై/ఆగస్టు నెలల్లో జిల్లాకు రూ.12.5 కోట్లు విడుదలయ్యాయి.

మార్గదర్శకాలు జారీ అయినా..

ఈ నిధులను ప్రధానమంత్రి శ్రీకారం చుట్టిన సంసద్ ఆదర్శ గ్రామ యోజన (ఎస్‌ఏజీవై) కింద ఎంపిక చేసిన గ్రామాల్లో తొలి ప్రాధాన్యతగా ఖర్చు చేయాలని..తర్వాత నియోజకవర్గానికి ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. అలా చేయడంతో ఈ ఎంపీ లాడ్స్ స్కీమ్ ప్రయోజనం దెబ్బతింటుందనే భావనతో గతంలో మాదిరిగానే వినియోగించుకునే విధంగా మళ్లీ వెసులుబాటు కల్పిస్తూ మార్గదర్శకాలు జారీ చేశారు. ఇవి వచ్చి మూడు నెలలు దాటిపోయాయి. అయినా ఏ ఒక్కరూ నిధులను ఖర్చు చేసే విషయమై ప్రతిపాదనలు పంపలేదు.
 
పర్సంటేజీలే ప్రధాన అడ్డంకి

తొలి విడత నిధులు ఖర్చు చేస్తే కానీ..మలి విడత మంజూరు కావని మన ఎంపీలకు తెలుసు. అయినా ఇప్పటి వరకు వీరిలో చలనం లేకపోవడానికి ప్రధాన కారణం పర్సంటేజీలు తెగక పోవడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఇచ్చే పర్సంటేజీలకు మించి ఇవ్వాలని డిమాండ్ అనుచరుల ద్వారా వీరు వినిపిస్తున్నారనే వాదనఉంది. ఒక పక్క నిధుల కోసం ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు ఎదురు చూస్తుంటే చేతుల్లో నిధులుండి కూడా మన ఎంపీలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
 
ఏవీ నాటి ‘కోట్ల’ హామీలు

హుద్ హుద్ తుఫాన్ నేపథ్యంలో మన ఎంపీలతో పాటు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవితో సహా ఏపీ, తెలంగాణాలకు చెందిన పలువురు లోక్‌సభ,రాజ్యసభసభ్యులు కోట్లాది రూపాయల ఎంపీ లాడ్స్ ఇస్తామంటూ వివిధ సందర్భాల్లో ఇబ్బడి ముబ్బడిగా హామీల జల్లు కురిపించారు. ఇప్పటి వరకు ఏ ఒక్కరూ తమ ఎంపీ లాడ్స్‌లో ఒక్క రూపాయి కూడా విశాఖకు కేటాయించిన దాఖలా లేదు. అందుబాటులో ఉన్న నిధులను విశాఖ పునర్నిర్మాణం కోసం చేపట్టే ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయడంతో పాటు  ఇతర ఎంపీలు ఇచ్చిన హామీల మేరకు నిధులు రాబట్టడంలో చురుకైన పాత్ర పోషించాల్సిన బాధ్యత జిల్లా ఎంపీలపై ఎంతైనా ఉంది. జాప్యంపై అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావును వివరణ కోరగా తాము ప్రతిపాదనలు ఎమ్మెల్యేల నుంచి ఆహ్వానిస్తున్నామన్నారు. తన పరిధిలోని ఎంఎల్‌ఎలకు రూ.50లక్షల వంతున పనుల కోసం కేటాయించామన్నారు. వారి నుంచి పనుల ప్రతిపాదనలు రాగానే నిధులు వెచ్చిస్తామన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement