♦ భారీ మార్పులకు సన్నాహాలు
♦ ప్రభుత్వ నిర్ణయమే తరువాయి
♦ పిల్లలు తక్కువ పేరుతో
♦ బడుల మూతకు సన్నద్ధం
ఒంగోలు వన్‌టౌన్ : ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను హేతుబద్ధీకరించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రాథమికోన్నత పాఠశాలలకు కూడా స్కూలు అసిస్టెంట్ ఇంగ్లిషు పోస్టులను కేటాయించడం, ఉన్నత పాఠశాలల్లోని ఇంగ్లిషు స్కూలు అసిస్టెంట్ పోస్టులను కుదించేందుకు ప్రతిపాదించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను మూసివేసేందుకు ప్రతిపాదించారు.
ప్రతిపాదనలు ఇవీ..
►తెలుగు మీడియం ఉన్నత పాఠశాలల్లో 75 మందిలోపు పిల్లలుంటే ఆ పాఠశాలను మూసివేస్తారు. 76 నుంచి 280 మంది వరకు విద్యార్థులున్న పాఠశాలకు హెచ్‌ఎం, స్కూలు అసిస్టెంట్లు గణితం, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, ఇంగ్లిషు, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ, పీఈటీ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున 9 పోస్టులు మాత్రమే కేటాయిస్తారు. 281 నుంచి 340 వరకు విద్యార్థులున్న పాఠశాలలకు అదనంగా గణితం, ఇంగ్లిషు పోస్టులు కేటాయిస్తారు.
341 నుంచి 400 వరకు పిల్లలున్న పాఠశాలకు అదనంగా తెలుగు పోస్టు ఒకటి కేటాయిస్తారు. 401 నుంచి 460 వరకు ఉంటే అదనంగా సోషల్‌స్టడీస్ పోస్టు కేటాయిస్తారు. 461 నుంచి 520 వరకు విద్యార్థులుంటే అదనంగా రెండు ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పోస్టు కేటాయిస్తారు. 521 నుంచి 580 వరకు పిల్లలుంటే అదనంగా మరో గణితం స్కూలు అసిస్టెంట్ పోస్టు కేటాయిస్తారు.
►తెలుగు, ఇంగ్లిషు మీడియం నిర్వహిస్తున్న పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంలో 75 మంది కంటే విద్యార్థులు తక్కువగా ఉంటే ఎత్తివేస్తారు. ఇంగ్లిషు మీడియం ఉన్న పాఠశాలల్లో 76 నుంచి 280 మంది వరకు విద్యార్థులుంటే స్కూలు అసిస్టెంట్ గణితం, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్డడీస్ పోస్టులు ఒక్కొక్కటి కేటాయిస్తారు. పిల్లలు 281 నుంచి 340 మంది ఉన్న పాఠశాలలకు అదనంగా మరో స్కూలు అసిస్టెంట్ గణితం పోస్టు ఇస్తారు. 341 నుంచి 400 వరకు విద్యార్థులుంటే అదనంగా సోషల్ స్డడీస్ పోస్టు కేటాయిస్తారు. 401 నుంచి 460 వరకు పిల్లలుంటే అదనంగా బయోలాజికల్ సైన్స్ పోస్టు, 461 నుంచి 520 వరకు విద్యార్థులుంటే స్కూలు అసిస్టంట్ ఫిజికల్ సైన్స్ పోస్టు కేటాయిస్తారు.
యూపీ స్కూళ్లకు ఇంగ్లిషు పోస్టు
►ప్రాథమికోన్నత పాఠశాలలకు స్కూలు అసిస్టెంట్ ఇంగ్లిషు పోస్టు కేటాయించాలని ప్రతిపాదించారు. 6, 7 తరగతులు ఉన్న యూపీ స్కూళ్లలో 35 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే ఆ పాఠశాలను ప్రాథమిక పాఠశాలగా స్థాయి కుదిస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం పోస్టులుంటే ఆ పోస్టును అవసరమున్న ప్రాథమిక పాఠశాలలకు తరలిస్తారు.
►6, 7, 8 తరగతులున్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో 55 మంది కంటే విద్యార్థులు తక్కువ ఉంటే ప్రాథమిక పాఠశాలగా స్థాయి కుదిస్తారు. పాఠశాల విద్యాశాఖ రూపొందించిన ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. పాఠశాలల హేతుబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఈ మార్పులన్నీ అమలులోకి రానున్నాయి.
బడుల హేతుబద్ధీకరణకు ప్రతిపాదనలు
Published Wed, Jul 29 2015 2:39 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM
Advertisement
Advertisement